టీమిండియాలో ఒకటి తక్కువైంది..!
ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టే క్రికెటర్లు..
క్రికెట్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్న అత్యంత ధనిక క్రికెట్ బోర్డు..
ఆటగాళ్లకు ఏ చిన్న ఇబ్బంది రాకుండా సకల సౌకర్యాలు..
ఇలా అనేగా హంగులు, విలాసాలు ఉన్నా.. టీమిండియాలో ఒకటి తక్కువైంది..!
కసి.. గెలవాలనే కసి తక్కువైంది.
ప్రస్తుతం టీమిండియా క్రికెటర్లకు ఏ విషయంలోనూ లోటు లేదు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన జీవితం వారి సొంతం.. ఇవన్నీ వారికి ఆటతోనే వచ్చాయి. కానీ.. ఆ ఆటతో దేశానికి, క్రికెట్ అభిమానులకు ఏం కావాలో అది మాత్రం చేయలేకపోతున్నారు. వరల్డ్ కప్ గెలవలేకపోతున్నారు. ఆట ఉంది, ఆడే సత్తా ఉంది.. అయినా ఏదో వెలితి! దాని పేరే కసి. హంగూ ఆర్భాటం, సకల సౌకర్యాలు, దిగ్గజ కోచ్‌లు, సపోర్టింగ్ స్టాప్, స్ట్రాటజీ టీమ్, టీమ్ మేనేజ్‌మెంట్, ధనిక బోర్డు, బోర్డులోని పెద్దలు, నేషనల్ క్రికెట్ అకాడమీ.. ఇలా ప్రపంచంలో చాలా జట్ల కంటే గొప్పగా ఎన్ని ఉన్నా.. గెలవాలనే కసి ఆటగాళ్లలో లేనప్పుడు అవన్నీ వేస్ట్‌గా మిగిలిపోతాయి. అయినా దేశం కోసం ప్రపంచ కప్ గెలవాలంటే.. ఒక పోరాటం చేయాలి. అలాంటి ఒక యుద్దాన్ని చేసి చూపించిన ఒక జట్టు గురించి తెలుసుకుందాం. అవమానాలు, ఆకలి బాధలు, అరాకొర సౌకర్యాలను లెక్కచేయకుండా.. ఒక ప్లానింగ్, పట్టుదలతో గెలవాలనే కసి, తపన ఆటగాళ్లలో ఎలా భగభగ మండాలో.. ఆ మంటల్లోంచి గెలుపనే వెలుగును ఎలా పొందాలో.. చేసి చూపించిన జట్టు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1996లో శ్రీలంక వన్డే వరల్డ్ కప్‌ను గెలిచింది. చాలా మంది క్రికెట్ అభిమానులకు తెలిసిన విషయం ఇదే. కానీ.. ఆ కప్ కోసం శ్రీలంక జట్టు చేసిన యుద్ధం మాత్రం చాలా మందికి తెలియదు. జట్టు అనే మాటకు అర్థం నేర్పిస్తూ.. వారు చూపించిన పట్టుదల, చేసిన పోరాటం గురించి తెలుసుకుంటే.. రోమాలు నిక్కబోడుచుకుంటాయి. ఒక వరల్డ్ కప్ గెలిచేందుకు ఇంత చేయలా..? అనే విషయం అవగతమవుతుంది. కనీసం మూడు పూటల తిండి కూడా ఏర్పాటు చేయలేని బోర్డు, అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడుతూ.. ప్రపంచ కప్ లాంటి పెద్ద వేదికలో పాల్గొనేందుకు వెళ్లినా.. కనీసం సరైన షూలు కూడా లేని పరిస్థితి శ్రీలంక ఆటగాళ్లది.
వరల్డ్ కప్‌కు కొన్ని నెలల ముందు శ్రీలంక ఒక సాధారణ టీమ్. అర్జున రణతుంగా కెప్టెన్సీలో అప్పటికే ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న ఆస్ట్రేలియాతో సిరీస్. శ్రీలంకకు ఘోర పరాజాయాలు ఎదురయ్యాయి. ఆటతోనే కాదు మాటలతో కూడా శ్రీలంక క్రికెటర్లను ఆస్ట్రేలియన్లు ఒక ఆట ఆడుకున్నారు. అన్నింటికీ మించి ఆ జట్టు యువ సంచలనం ముత్తయ్య మురళీ ధరణ్‌ది అసలు బౌలింగే కాదని.. మ్యాచ్ మధ్యలో ఆపేసి, ఆస్ట్రేలియన్ అంపైర్లు ఘోరంగా అవమానించారు. బౌలింగ్ వేస్తుంటే సరిగా లేదని, నో బాల్ ఇచ్చి.. ఓవర్‌ను క్యాన్సిల్ చేసి అందరి ముందు అవమాన పరిచారు. జట్టు చూస్తే దారుణంగా ఓడిపోయింది. ఓటమి భారం.. మురళీధరణ్‌కు జరిగిన అవమానం.. ఆ జట్టును కుంగదీసింది. అది జట్టు మొత్తానికి జరిగిన అవమానంగా లంకేయులు భావించారు. ఈ అవమానమే పసికూన లంకను సింహాలుగా మార్చింది. వరల్డ్ కప్ గెలిచి.. తమ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాలనే కసి వారిలో పుట్టించింది.
కానీ.. అదే సమయంలో దేశంలో అల్లకల్లోల పరిస్థితులు, లంకేయులకు, తమిళ టైగర్స్ మధ్య భీకరపోరాటంతో లంక రాజధాని కొలంబోలో బాంబుల వర్షం కురిసింది. ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్‌ను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. శ్రీలంకలో నెలకొన్న ఆందోళనల దృష్ట్యా ఆ దేశంలో క్రికెట్ ఆడేందుకు ఏ జట్టు ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో లంక క్రికెట్ బోర్డు దివాలా తీసే పరిస్థితికి వచ్చేసింది. ఆటగాళ్లకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అంతలోనే వరల్డ్ కప్ ముంచుకొచ్చింది. భారత్-పాక్ సంయుక్తంగా వరల్డ్ కప్ నిర్వహణకు సిద్ధమయ్యాయి. ఇక ఆటగాళ్లకు కనీస సౌకర్యాలు కల్పించి.. వరల్డ్ కప్ కోసం పంపే స్థోమత కూడా లంక బోర్డుకు లేకపోయింది. అయినా.. ఏదో విధంగా స్పాన్సర్లను పట్టుకుని.. మొత్తనాకి జట్టును వరల్డ్ కప్ కోసం పంపారు.
వరల్డ్ కప్ కోసమైతే పంపారు సరే కానీ.. లంక ఆటగాళ్లకు కనీసం మూడు పూటల సరైన తిండి కూడా ఉండేది కాదు. ఒకే ఒక జత జెర్సీ, ఒకే జత షూ.. ఇంకో జతకు ఆస్కారమే లేదు. లంక క్రికెట్ బోర్డు పరిస్థితి అలా ఉంది మరి. వరల్డ్ కోసం గంటలకొద్ది ప్రాక్టీస్‌తో పాటు టీమ్ మీటింగ్‌లో ఏకంగా రెండు గంటలు గడిపేవారు. రాత్రి భోజన సమయంలో అందరూ ఒక చోట చేరి భోజనాన్ని పంచుకునే వారు. జట్టుగా ఉంటూ.. ఒకరికి ఒకరు మద్దతుగా నిలిచేవారు.
వరల్డ్ కప్ ఆరంభానికి ముందు అందరి దృష్టిలో శ్రీలంక ఒక పసికూన జట్టు. అలాంటి టీమ్ కెప్టెన్ రణతుంగా ఇచ్చిన స్టేట్‌మెంట్ ఏంటో తెలుసా..? ‘ఫైనల్‌కు ఆస్ట్రేలియా రావాలి, వారిని మేము అక్కడ ఓడిస్తాం.’ ఈ స్టేట్‌మెంట్ అప్పట్లో ఒక సంచలనం. కానీ.. ఇదేదో ఆస్ట్రేలియాపై కోపంతో చెప్పలేదు రణతుంగా.. దానికి కోసం జట్టును సిద్ధం చేసుకునే వరల్డ్ కప్‌కు వచ్చాడు. జట్టులోని ప్రతి ఆటగాడికి ఒక నిర్ధిష్టమైన రోల్ ఇచ్చాడు. జట్టు కోసం అతను ఏం చేయాలో జట్టులో తన రోల్ ఏంటో వివరించి, అలానే ట్రైన్ చేసి తీసుకొచ్చాడు. జట్టులో ప్రయోగాలు చేశాడు. 7, 8 స్థానాల్లో బ్యాటింగ్ చేస్తున్న జయసూర్య, రొమేష్ కలువితారణలతో ఓపెనింగ్ చేయించాడు. వికెట్ పోయినా పర్వాలేదు.. మీ పని కొట్టడమే, జట్టులో మీ స్థానానికి నాది హామీ అంటూ వారికి భరోసా ఇచ్చాడు.
బౌలింగ్ సరిగా లేదని.. అవమానం ఎదుర్కొన్న ముత్తయ్యనే ఆసీస్‌పై అస్త్రంగా మారాడు. జట్టులో ఉన్న 11 మందిలో 10 మందికి ఒక నిర్ధిష్టమైన రోల్ ఉంది. కానీ.. అరవింద డిసిల్వాకు లాంటి రోల్ ఇవ్వలేదు. అతన్ని అడవిలో సింహంలా ఫ్రీగా ఉంచారు. ఇది కూడా ప్లాన్‌లో భాగమే. డిసిల్వా బలమేంటో బాగా తెలిసిన కెప్టెన్ రణతుంగా అతన్ని కట్టేయకుండా.. విస్పోటనం కోసం అలా వదిలేశాడు. ఆ విస్పోటనమే ఆస్ట్రేలియాపై ఫైనల్లో సెంచరీతో విధ్వంసం సృష్టించింది. శ్రీలంక విశ్వవిజేతగా ఆవిర్భవించింది.
ఇలా ఒక వరల్డ్ కప్ గెలిచేందుకు లంక ఒక యుద్ధం చేసింది. అవమానాలు, ఆకలి బాధలను భరించింది.. అరాకొర సౌకర్యాలతోనే అద్భుతమైన ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఏ జట్టుతో మ్యాచ్ ఆడినా.. ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం జట్టుగా గెలిచేందుకు వెళ్లింది. అంతేకానీ.. ఏదో ఒక ఆటగాడిపై నమ్మకంతో ఏముంది గెలిచేస్తాం.. లేకుంటే ఓడిపోతాం అని వెళ్లలేదు. కచ్చితంగా గెలుస్తాం.. గెలిచేందుకే ఆడుతున్నామని.. ఒక పక్కా ప్లాన్‌తో ప్రతి మ్యాచ్ ఆడింది.. ఛాంపియన్‌గా అవతరించి.. చరిత్ర సృష్టించింది. ఇలాంటి ఒక పోరాటం 1983 వరల్డ్ కప్ కోసం టీమిండియా కూడా చేసింది. కానీ.. ఇప్పుడున్న టీమిండియాలో గెలవాలనే కసి కానీ.. ఓడిపోతున్నాం అనే బాధ కానీ కనిపించడంలేదు. ఫ్రాంచైజీ క్రికెట్ ఆడి ఆడి.. ఓటమి భారమంటే ఏంటో తెలియకుండా పోయింది. భారత జట్టులో మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. కానీ వరల్డ్ కప్ గెలవాలంటే కావాల్సింది ఒకరో, ఇద్దరో మ్యాచ్ విన్నర్లు కాదు.. ‘మ్యాచ్ విన్నింగ్ టీమ్’ కావాలి. ఆ టీమ్‌లో గెలవాలనే కసి ఉండాలి.
1996 World Cup was pure magic.
This man took his game to another level.
Glorious cricketing strokes.@bcdeshmukh83 @elitecynic @NorthStandGang @Marcus60s70s80s @KK_Ilkal @Shyamjourno @Sachislife pic.twitter.com/CS7zM46DkJ— Anirudh Kalra (@CricketKalra) November 3, 2022
Deft and cheeky with a bat in hand, Arjuna Ranatunga also captained Sri Lanka to World Cup glory in 1996.
Wishing him a very happy birthday!https://t.co/llVOPCFfRK pic.twitter.com/COmJPHeCzU
— Cricbuzz (@cricbuzz) December 1, 2020