ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా విఫలం అవ్వడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. కేవలం విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ రాణించడంతోనే భారత్ సెమీస్ వరకు చేరిందని.. లేకుంటే, సూపర్ 12లోనే ఇంటిబాట పట్టేదని అంటున్నారు. సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసిన విజయం తెలిసిందే. 169 పరుగుల టార్గెట్ సెట్ చేసినా.. ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడిపోవడంపై క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. ముఖ్యంగా ఓపెనర్ కేఎల్ రాహుల్, కెప్టెన్ రోహిత్ శర్మ, బౌలర్లపైనే తీవ్ర విమర్శలు వచ్చాయి. కేఎల్ రాహుల్ స్లో బ్యాటింగ్ అప్రోచ్ జట్టు మొత్తంపై ప్రభావం చూపిందని.. అంత చెత్త ఫామ్‌లో ఉన్నా అతన్ని ఎందుకు కొనసాగించారో అర్థం కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్లు సైతం టీమిండియా వైఫల్యాలను ఎత్తిచూపారు. టీ20లకు యువ క్రికెటర్లను తీసుకోవాలని.. ఫామ్‌లో లేని సీనియర్లను పట్టుకుని వేలాడొద్దని అంటున్నారు. ఇక టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అయితే జిడ్డు ఓపెనర్లను పక్కన పెట్టి వేగంగా ఆడే యువ క్రికెటర్లను టీ20లకు జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. పృథ్వీ షాను త్వరలోనే టీమిండియా జెర్సీలో చూడాలనుకుంటున్నట్లు సెహ్వాగ్ పేర్కొన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో ఓపెనర్‌గా తన పవర్ హిట్టింగ్‌తో దుమ్ములేపుతున్న పృథ్వీ షాకు సరైన అవకాశాలు టీమిండియాలో దక్కలేదనే చెప్పాలి. పృథ్వీ షా బ్యాటింగ్ శైలి దాదాపు సెహ్వాగ్‌ను పోలి ఉంటుంది.
సెహ్వాగ్ చెప్పినట్లు పృథ్వీ షా లాంటి బ్యాటర్ అవసరం టీమిండియా ఎంతైనా ఉంది. టీ20 లాంటి ఫాస్ట్ ఫుడ్ క్రికెట్‌లో ఓపెనర్లు మంచి స్టార్ట్ ఇవ్వడం ఎంతో అవసరం. పైగా పవర్‌ప్లేలో వీలైనన్ని ఎక్కువ రన్స్ రాబట్టాలంటే అగ్రెసివ్ బ్యాటింగ్ చేయాలి. కానీ.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ నుంచి అలాంటి ఇన్‌టెంట్ కనిపించలేదు. తొలి ఓవర్‌ను మెయిడెన్‌గా ఆడటంతో ప్రత్యర్థి బౌలర్ల ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. అలాగే మరో ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌పై కూడా ఒత్తిడి పెరిగి అతను భారీ షాట్లకు వెళ్లి అవుటయ్యే ప్రమాదం ఉంది. వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ అవుటైన విధానం చూస్తే.. ఈ విషయం అర్థం అవుతుంది. అందుకే భయపడుతూ ఆడే ఓపెనర్ కంటే భయంలేకుండా బౌలర్లపై ఎదురుదాడికి దిగే ఓపెనర్ అవరసం టీమిండియాకు ఉంది. ఆ ఓపెనర్ పృథ్వీషా అని సెహ్వాగ్ భావిస్తున్నాడు.
Virender Sehwag On Prithvi Shaw!
.
.#CricketTwitter #VirenderSehwag #TeamIndia #T20WorldCup #PrithviShaw pic.twitter.com/KMlGHQpFgC— CRICKETNMORE (@cricketnmore) November 14, 2022