గ్రూప్-ఏ, బీ లలో జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లతో టీ20 వరల్డ్‌కప్ సమరం ప్రారంభం అయింది. అసలు పోరు 23 నుంచి ప్రధాన జట్ల మధ్య జరగనుంది. కాగా ఈ వరల్డ్‌కప్‌ను టీమిండియా కచ్చితంగా గెలిచితీరాలని టీమిండియా మాజీ ఆటగాడు సురేష్‌రైనా అన్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కోసమైనా ఈ సారి కప్ సాధించాలని జట్టు ఆటగాళ్లను కోరాడు. అందుకు కారణం కెప్టెన్‌గా కోహ్లీ ఖాతాలో ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా లేదు. ధోని తర్వాత జట్టు పగ్గాలు చేపట్టిన విరాట్ ఇండియాకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. కానీ ఒకే ఒక లోటు ఉండిపోయింది. అదే ఐసీసీ ట్రోఫీ.
ప్రస్తుతం అన్ని అంశాలు టీమిండియాకు అనుకూలంగా ఉన్నాయి. జట్టు పరంగా భీకరంగా ఉంది. ఐపీఎల్ 2021 యూఏఈలో జరిగింది. టీ20 వరల్డ్ కప్ కూడా అక్కడే జరగనుండడంతో అక్కడి పిచ్‌లపై టీమిండియా ఆటగాళ్లకు ఒక అంచనా వచ్చి ఉంటుంది. అక్కడి పరిస్థితులకు ఇప్పటికే అలవాటు పడిపోయారు. ఎలాగైనా ఈ సారి కప్ కొట్టాలని కోహ్లీతో పాటు జట్టు సభ్యులంతా దృఢ నిశ్చయంతో ఉన్నారు. వీటికి తోడు ధోని జట్టుకు మెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ధోని వ్యూహాలు, సలహాలు జట్టుకు ఎంతో ఉపయోగపడనున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సురేష్ రైనా టీమిండియా ఆటగాళ్లు మంచి ప్రదర్శన కనబర్చి విరాట్‌కోహ్లీకి వరల్డ్‌కప్‌ను కానుకగా అందించాలని కోరారు.
కాగా విరాట్ కోహ్లీ ఈ వరల్డ్‌కప్ టోర్నీ తర్వాత టీ20 జట్టు కెప్టెన్‌గా తప్పుకోనున్నాడు. అలాగే టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కెరీర్‌లో ఐసీసీ ట్రోఫీ లేదనే బెంగ 2011కు ముందు వరకూ ఉండేది. ఆ సమయంలో 2011 వన్డే వరల్డ్ కప్‌ను గెలిచి సచిన్‌కు కానుకగా ఇస్తామని మాజీ క్రికెటర్ 2011 ప్రపంచ కప్ హీరో యువరాజ్ సింగ్ ప్రకటించాడు. అనుకున్నట్లుగానే ఇండియా 2011లో విశ్వవిజేతగా నిలిచింది. సచిన్ కెరీర్‌లో ఐసీసీ ట్రోఫీ లేదనే మచ్చను తొలిగిపోయింది. ఇప్పుడు కూడా ఇండియా ఈ టీ20 వరల్డ్‌కప్‌ను గెలిచి కోహ్లీకి ఐసీసీ ట్రోఫీ గిఫ్ట్‌గా అందించాలని రైనాతో భారత క్రికెట్ అభిమానులందరూ కోరుకుంటున్నారు.