1999 ఫిబ్రవరీ 7.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ సంచలనం నమోదైంది. 5 వికెట్ల హాల్ తీయడమే గొప్పగా భావిస్తున్న తరుణంలో.. ఓ టెస్టులో అందులోనూ ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసి ఓ భారత బౌలర్ చరిత్ర సృష్టించాడు. అతనే మన ‘జంబో’ అనిల్ కుంబ్లే. మ్యాజిక్ లెగ్ స్పిన్‌తో ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కుంబ్లే కొన్ని ఏళ్ల పాటు టీమిండియా స్పిన్ బౌలింగ్‌కు పెద్ద దిక్కుగా ఉన్నాడు. లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ జోడీ ప్రత్యర్థులకు నిద్రలేకుండా చేసేది. ఈ క్రమంలోనే 1999లో రెండు టెస్టులు ఆడేందుకు చిరకాల ప్రత్యర్థి భారత పర్యటనకు వచ్చింది.
ఢిల్లీ వేదికగా రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాక్ స్పిన్నర్ షక్లైన్ ముస్తాక్ 5 వికెట్లతో చెలరేగడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ సదగొప్పన్ రమేష్ 60, కెప్టెన్ అజహరుద్దీన్ 67 పరుగులతో రాణించారు. తొలి ఇన్నింగ్స్‌కు దిగిన పాకిస్థాన్‌ను సైతం భారత బౌలర్లు పెద్దగా స్కోర్ చేయనివ్వలేదు. కుంబ్లే 4, హర్భజన్ 3, వెంకటేష్ ప్రసాద్ 2, శ్రీనాథ్ ఒక వికెట్ తీసుకోవడంతో పాక్ 172 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియాకు నామమాత్రపు లీడ్ వచ్చింది. దీంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్.. ఈ సారి పాక్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని 339 పరుగుల చేసింది. ఓపెనర్ రమేష్ 96, సౌరవ్ గంగూలీ 62 నాటౌట్, శ్రీనాథ్ 49 పరుగులతో రాణించడంతో పాక్‌కు టీమిండియా 400 పైచిలుకు టార్గెట్‌ను నిర్దేశించింది.
ఈ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో పాక్ ఓపెనర్లు సయీద్ అన్వర్ 69, షాహిద్ అఫ్రిదీ 41 రన్స్‌తో మంచి ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో.. పాక్‌కు గెలుపుపై ఆశలు రేకెత్తాయి. కానీ.. జంబో(అనిల్ కుంబ్లే) ఎంట్రీతో పాక్ కథ తలకిందులైంది. ఇన్నింగ్స్ 25వ ఓవర్ వేసేందుకు వచ్చిన కుంబ్లే.. రెండో బంతికి అఫ్రిదీని అవుట్ చేసి.. తర్వాతి బంతికే వన్‌డౌన్ బ్యాటర్ అహ్మెద్‌ను డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఇంజుమామ్ ఉల్ హక్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి.. తర్వాతి బంతికే మొహమ్మద్ యూసుఫ్‌ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. అక్కడ ఏం జరుగుతుందో పాక్‌కు అర్థం కాలేదు. రెండు ఓవర్ల వ్యవధిలో పాక్ నాలుగు వికెట్లు కోల్పోయింది. 100-0గా ఉన్న పాక్, కుంబ్లే వేసిన రెండు ఓవర్ల తర్వాత.. 115-4గా మారింది. జస్ట్ కుంబ్లే మ్యాజిక్‌తో పాక్ బ్యాటింగ్ లైనప్ అతలాకుతలమైంది.
తన స్పిన్ మ్యాజిక్‌తో పాకిస్థాన్‌ను వణికించిన కుంబ్లే.. వంద పరుగులు చేసి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఉన్న పాకిస్థాన్‌ను 207కు ఆలౌట్ చేశాడు. 10కి 10 వికెట్లను కుంబ్లేనే పడగొట్టాడు. దీంతో టీమిండియా 212 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా.. పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసిందనేకంటే.. కుంబ్లే పాక్‌ను ఆలౌట్ చేశాడని చెప్పడమే సమంజసం. అంతలా కుంబ్లే తన స్పిన్ మాయాజాలం పాక్‌పై ప్రదర్శించాడు. కుంబ్లే బాల్‌ను గింగిరాలు తిప్పుతుంటే.. ఆడలేక పాక్ ఆటగాళ్లు రెండు చేతులు ఎత్తేశారు. దీంతో.. క్రికెట్ చరిత్రలో ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా, టీమిండియా తొలి బౌలర్‌గా కుంబ్లే నిలిచి చరిత్ర సృష్టించాడు. కుంబ్లే కంటే ముందు ఇలాంటి ఫీట్‌ను ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ 1956లో ఆస్ట్రేలియాపై 10కి 10 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత కుంబ్లే 1999లో పాకిస్థాన్‌పై ఈ ఫీట్ సాధించాడు. కుంబ్లే తర్వాత న్యూజిలాండ్ యువ స్పిన్నర్ అజాజ్ పటేల్ మనపైనే 2021 డిసెంబర్‌లో జరిగిన టెస్టులో 10కి 10 వికెట్లు పడగొట్టి.. మూడో బౌలర్‌గా నిలిచాడు. ఆ టైమ్‌లో కుంబ్లే సైతం అజాజ్‌ను ఎంతో అభినందించాడు. అయితే.. కుంబ్లే 10 వికెట్ల తీయడం వెనుక ఓ బలమైన కారణం కూడా ఉంది.
కుంబ్లే 10 వికెట్ల వెనుక అసలు కథ..
1999లో రెండు టెస్టులు ఆడేందుకు పాకిస్థాన్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టు కంటే ముందు చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో సచిన్ టెండూల్కర్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగినా.. గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా కేవలం 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో సచిన్ టెండూల్కర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. మ్యాచ్ ఓడిపోవడంతో తనకు వచ్చిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ను అందుకునేందుకు సైతం వెళ్లలేదు. అంత బాధలో ఉన్న సచిన్‌ను చూసి.. భారత జట్టు మొత్తం ఆవేశంతో రగిలిపోయింది.
ముఖ్యంగా ‘జంబో’ అనిల్ కుంబ్లే పాక్ పనిపట్టేందుకు సిద్ధమయ్యాడు. అంతే.. ఆ వెంటనే ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో తన స్పిన్ మాయాజాలంతో పాక్ ఆటకట్టించాడు. ఒక ఇన్నింగ్స్‌లోని మొత్తం వికెట్లు తీసుకోవడంతో పాటు మ్యాచ్ మొత్తం మీద 14 వికెట్లు పడగొట్టి.. టీమిండియాను గెలిపించాడు. దీంతో సిరీస్‌ను టీమిండియా 1-1తో సమం చేసింది. సచిన్ ముఖంపై చిరునవ్వు పూసింది. కుంబ్లే 10 వికెట్ల హాల్ సాధించి నేటికి సరిగ్గా 24 ఏళ్లు పూర్తి అయ్యాయి. మరి ఆ చారిత్రాత్మక ఫీట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
2⃣6⃣.3⃣ Overs
9⃣ Maidens
7⃣4⃣ Runs
1⃣0⃣ Wickets🗓️ #OnThisDay in 1999, #TeamIndia legend @anilkumble1074 etched his name in record books, becoming the first Indian cricketer to scalp 1⃣0⃣ wickets in a Test innings 🔝 👏
Revisit that special feat 🔽 pic.twitter.com/wAPK7YBRyi
— BCCI (@BCCI) February 7, 2023