ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ గుర్తుండే ఉంటుంది. తొలి ప్రపంచ కప్ కోసం రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో అదృష్టం ఇంగ్లండ్‌ను వరించింది. మ్యాచ్ సూపర్ ఓవర్‌లోనూ టై అయినా.. ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్ జట్టును విజేతగా ప్రకటించాడు. దీంతో ఇంగ్లండ్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. మరో వైపు తొలి వరల్డ్ కప్ సాధించాలన్న న్యూజిలాండ్ ఆశలు అడియాశలయ్యాయి.
ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ విరోచితంగా పోరాడి.. ఇంగ్లండ్ కప్ గెలవడంలో ముఖ్యభూమిక పోషించాడు. ఫైనల్‌లో ఆడిన ఇన్నింగ్స్‌తో బెన్‌స్టోక్స్ ఇంగ్లండ్‌కు హీరో అయిపోయాడు. అంతకు ముందు, ఆ తర్వాత కూడా ఇంగ్లండ్‌కు ఒంటిచేత్తో ఎన్నో విజయాలు అందించాడు. బెన్‌స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాడిగా ఎదుగుతాడని న్యూజిలాండ్ రాస్ టేలర్ ఎప్పుడో గ్రహించాడు. బెన్‌స్టోక్స్ 18 ఏళ్ల వయసులోనే అతనిలోని స్పార్క్‌ను గమనించిన రాస్ టేలర్.. అతన్ని న్యూజిలాండ్‌కు ఆడాలని కూడా కోరాడు.
రాస్ టేలర్, బెన్‌స్టోక్స్ కలిసి డర్హమ్ టీమ్‌కు ఆడుతున్న సమయంలో బెన్‌స్టోక్స్‌ను న్యూజిలాండ్ తరఫున ఆడాలని టేలర్ కోరాడు. అందుకు బెన్‌స్టోక్స్ కూడా ఆసక్తి చూపించినట్లు టేలర్ తన ఆత్మకథ ‘రాస్ టేలర్ బ్లాక్ అండ్ వైట్’లో పేర్కొన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టేలర్.. తన ఆత్మకథను పుస్తకం రూపంలో తీసుకోచ్చాడు. అందులో చాలా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
న్యూజిలాండ్ డ్రెస్సింగ్ రూమ్‌లో జాత్యాహంకారం, ఐపీఎల్‌లో రాజస్థాన్ ఓనర్ తనపై చేయి చేసుకోవడం, సెహ్వాగ్ తనకు ఇచ్చిన సలహా లాంటి సంచలన, ఆసక్తికర విషయాలు పుస్తకంలో పేర్కొన్నాడు. తాజాగా ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను న్యూజిలాండ్ తరపున ఆడమని ఆహ్వానించడం, అందుకు స్టోక్స్ ఆసక్తి చూపినా అది కార్యరూపం ఎందుకు దాల్చలేదనే ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
‘బెన్‌స్టోక్స్‌లోని ప్రతిభను గుర్తించి నేను అతన్ని న్యూజిలాండ్‌కు ఆడాలని కోరాను. అందుకు అతను కూడా ఇంట్రస్ట్ చూపించాడు. ఇదే విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు పెద్దలకు చెబితే.. వాళ్లు కూడా సరే అన్నారు. పైగా స్టోక్స్ న్యూజిలాండ్‌కు చెందిన వాడే. కానీ.. బెన్‌స్టోక్స్‌ను న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్ నుంచి మొదలుపెట్టాల్సిందిగా సూచించారు. కానీ.. బెన్‌స్టోక్స్‌కు అతని కెరీర్ గురించి న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నుంచి మరింత గట్టి హామీ, భరోసా దక్కాల్సింది.
బోర్డు పెద్దలు స్టోక్స్‌కు జాతీయ జట్టులో చోటు పక్కా అనే నమ్మకం కలిగించలేకపోయారు. దీంతో స్టోక్స్ ఇంగ్లండ్‌కు ఆడేందుకే మొగ్గు చేపాడు. ఆ తర్వాత అతను ఇంగ్లండ్ తరపున ఆడి స్టార్ ప్లేయర్‌గా ఎదిగిన విషయం తెలిసిందే.’ అంటూ రాస్ టేలర్ చెప్పుకొచ్చాడు. కానీ.. బెన్ స్టోక్స్‌ను న్యూజిలాండ్‌కు ఆడించాలనే ప్లాన్ వర్క్‌అవుట్ అయి ఉంటే.. 2019 వన్డే వరల్డ్ కప్ న్యూజిలాండ్ గెలిచి ఉండేదని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Former New Zealand captain Ross Taylor revealed that he asked Ben Stokes if he wanted to play in New Zealand. https://t.co/kzdfPRFiag
— CricTracker (@Cricketracker) August 15, 2022
ఇది కూడా చదవండి: రికార్డ్ అలర్ట్! 7 సిక్సులు, 3 ఫోర్లతో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ