ఐపీఎల్ 2023 మినీ వేలానికి సమయం ఆసన్నమైంది. డిసెంబర్ 23న, శుక్రవారం కేరళలోని కోచ్చి వేదికగా ఈ వేలం జరగనుంది. మొత్తం 991 మంది ఆటగాళ్లు వేలానికి రిజిస్టర్ చేసుకోగా.. అందులో నుంచి 405 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేశారు. ఇందులో 273 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 132 మంది విదేశీ ప్లేయర్లున్నారు. ఇందులో నుంచి గరిష్టంగా 87 మంది ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. 30 స్లాట్స్ విదేశీ ఆటగాళ్లకు దక్కనుండగా.. మరో 57 స్థానాల కోసం భారత ఆటగాళ్లు పోటీపడనున్నారు. అయితే.. ఇదీ మినీ వేలమైనా.. మునుపటి రికార్డులు కొల్లగొట్టేలా కనిపిస్తోంది.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మొత్తం అందుకున్న ప్లేయర్లలో మాజీ సారధి విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఆర్సీబీ తరుపున కోహ్లీ రూ.17 కోట్లు అందుకుంటుంటే, లక్నో జెయింట్స్ సారథిగా రాహుల్ రూ.17 కోట్లు అందుకుంటున్నారు. ఈసారి వీరి రికార్డులు కనుమరుగయ్యేలా ఉన్నాయి. రూ.20 కోట్ల మార్కును తాకుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బెన్ స్టోక్స్‌తో పాటు సామ్ కుర్రాన్, రిలే రూసో, నికోలస్ పురాన్, హ్యారి బ్రూక్, కామెరూన్ గ్రీన్, మయాంక్ అగర్వాల్, సికందర్ రజా వంటి స్టార్లు వేలంలో ఉన్నారు. దీంతో భారీ ధర పలకడం ఖాయమనిపిస్తోంది. అయితే.. ముగ్గురి ఆటగాళ్లపై మాత్రం అన్ని ఐపీఎల్ ప్రాంఛైజీలు ద్రుష్టి పెట్టొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇంగ్లాండ్ ఆటగాడైన బెన్ స్టోక్స్ ప్రస్తుతం ఉన్న ఆల్ రౌండర్లలో టాప్ క్రికెటర్. ఆ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సమర్ధుడు. అంతేకాదు.. ఒంటి చేత్తో మ్యాచును శాసించగలడు. స్టోక్స్ ని సొంతం చేసుకోవడానికి CSK, MI, RCB ప్రాంఛైజీలు ఎంత మొత్తాన్నినైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయి. సన్ రైజర్స్ పోటీపడుతుందా? లేదా? అన్నది చూడాలి. రూ. 15 నుంచి రూ. 18 కోట్లు పలకవచ్చని అంచనా.
సామ్ కుర్రాన్ కూడా ఇంగ్లాండ్ ఆటగాడే. బౌలింగ్ ఆల్ రౌండర్. స్లో కటర్లతో బ్యాటర్లను ముప్పుతిప్పుల పెట్టగల కుర్రాన్, బ్యాటింగ్ లోనూ మెరుపులు మెరిపించగలడు. CSK, MI, RCB మధ్య గట్టి పోటీ ఎక్సపెక్ట్ చేయొచ్చు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సామ్ కుర్రాన్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’గా ఎంపికయ్యాడు. 6 మ్యాచ్‌ల్లో 11.38 సగటుతో 13 వికెట్లు తీశాడు. రూ. 7 నుంచి రూ. 9 కోట్లు పలకవచ్చని అంచనా.
ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయిన కామెరాన్ గ్రీన్ బ్యాటింగ్ ఆల్ రౌండర్. ఈసారి మినీ వేలంలో గ్రీన్ కూడా అత్యధిక ధర పలకొచ్చని అంచనా. ఇటీవల స్వదేశంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన సిరీస్‌లో అతడు చెలరేగి ఆడాడు. భారత బౌలర్లను చీల్చి చెండాడాడు. ఇదే అతనికి కలిసొచ్చే అంశం. SRH, CSK, MI, RCBల మధ్య పోటీ తప్పదంటున్నారు విశ్లేషకులు. రూ. 5 నుంచి రూ. 7 కోట్లు పలకవచ్చని అంచనా. వీరు కాకుండా.. మినీ ఆటగాళ్లలో ఎవరు ఎక్కువ ధర పలకవచ్చు. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.