అది 2008.. ఇండియన్ క్రికెట్ లీగ్ లో భాగంగా లాహోర్ బాద్షాష్ వర్సెస్ హైదరాబాద్ హీరోస్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలి ఓవర్ నుంచే పడ్డ బాల్ పడ్డట్లే ప్రేక్షకుల్లోకి నేరుగా వెళ్లిపోతుంది. సిక్స్ లతో, ఫోర్లతో బ్యాట్స్ మెన్ బౌలర్లపై దారుణంగా విరుచుకుపడుతున్నాడు. అయితే క్రీజ్ లో ఉన్నది మాత్రం ఏ వీరేంద్ర సెహ్వాగో, విరాట్ కోహ్లీనో కాదు. ఓ బక్కపలచని శరీరంతో ఉన్నాడో బ్యాటర్ అతడే ఇమ్రాన్ నజీర్.. పాకిస్థాన్ డాషింగ్ ఓపెనర్. ఈ మ్యాచ్ లో కేవలం 44 బంతుల్లోనే 11 సిక్స్ లు, 7 ఫోర్లతో 111 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందిచాడు. అప్పట్లో ఇమ్రాన్ నజీర్ ఓ సంచలనం.. పాకిస్థాన్ కు దొరికిన తురుపు ముక్కగా మాజీలు వర్ణించారు. అదీ కాక నజీర్ ను 10 మంది సెహ్వాగ్ లతో సమానంగా పోల్చిన సందర్భాలు లేకపోలేదు. మరి ఇంతటి మేటి ఆటగాడు అయిన నజీర్ కు అనుకున్నంత పేరు మాత్రం రాలేదనే చెప్పాలి. దానికి కారణాం పాక్ క్రికెట్ బోర్డా? లేక నజీర్ స్వయం కృపరాధమా? మరిన్ని వివరాల్లోకి వెళితే..
వీరేంద్ర సెహ్వాగ్-ఇమ్రాన్ నజీర్.. దేశాలు వేరైనా ఇద్దరి విధ్వంసం మాత్రం ఒక్కటే.. అదే బౌలర్ల ఊచకోత. అయితే సెహ్వాగ్ కు వచ్చినంత పేరు రాకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. సెహ్వాగ్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో డాషింగ్ బ్యాటర్ గా గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే వీరు భాయ్ ఇంతలా గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం గంగూలీ అనే చెప్పాలి. వన్డేలకు, టీ20 లకు తప్ప టెస్ట్ మ్యాచ్ లకు పనికిరాడని సెహ్వాగ్ పై ముద్ర వేశారు. కానీ వీరు లో ఉన్న టాలెంట్ ను కనిపెట్టిన దాదా.. అతడిని టెస్టు జట్టులోకి తీసుకున్నాడు. తన విలువైన సలహాలు, సూచనలతో టెస్టుల్లో సెహ్వాగ్ ను నిలదొక్కుకునేలా చేశాడు. దాంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగా చేసుకుంటూ.. వీరేంద్రుడు చెలరేగిపోయాడు. టెస్టుల్లో త్రిబుల్ సెంచరీ చేసిన తొలి ఇండియన్ క్రికెటర్ గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
అయితే నజీర్ విషయంలో పాక్ బోర్డు ఇలా చేయలేదు. కొన్ని మ్యాచ్ ల్లో విఫలం కాగానే అతడిని జట్టు నుంచి పక్కకు పెట్టేది. అదీ కాక అతడి మెరుపు ఇన్నింగ్స్ లు టెస్టులకు పనికిరావని నిర్ధారించుకున్న పాక్ సెలక్టర్లు.. అతడి టెస్టు కెరీర్ ను 8 మ్యాచ్ లకే పరిమితం చేశారు. ఈ 8 మ్యాచ్ ల్లో 2 సెంచరీలు, ఒక అర్దశతకం ఉండటం విశేషం. అయితే తన కెరీర్ నాశనం కావడంలో నజీర్ స్వయం కృపరాధం కూడా ఉంది. అతడు ఎప్పుడు బాల్ ను బలంగా బాదడం మీదే దృష్టి పెట్టాడు కానీ.. తన టెక్నిక్, తన ఫుట్ వర్క్ ని ఎప్పటికప్పుడు మార్చుకోవడంలో విఫలం అయ్యాడు. దాంతో తన సూనామీ ఇన్నింగ్స్ లను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలం అయ్యి సెలక్టర్ల దృష్టి నుంచి దూరంగా వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే జట్టులో అప్పటికే ఓపెనర్లు గా ఇమ్రాన్ ఫహత్, మహమ్మద్ హఫీజ్, సల్మాన్ బట్ లాంటి ఆటగాళ్లు రాణిస్తుండటంతో నజీర్ వైపు సెలక్టర్లు, పాక్ బోర్డు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు.
అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే? మిగతా దేశాల క్రికెట్ బోర్డులు జట్టులో ఒక్కో ఆటగాడిపై ప్రత్యేక శ్రద్ద పెడుతు ఉంటాయి. కానీ పాక్ క్రికెట్ బోర్డు అలా కాదు. ఎప్పుడైనా సరే ఆటగాడిలో దాగిఉన్న నైపుణ్యాన్ని బయటికి తీయడానికి కొంత సమయం పడుతుంది. కానీ పాక్ సెలక్టర్లు అంత సహనంతో వ్యవహరించలేదు. దాంతో చాలా మంది నైపుణ్యం గల ఆటగాళ్లు ప్రపంచ క్రికెట్ లో నజీర్ లాగా కనుమరుగుకాక తప్పట్లేదు. ఇక ఇమ్రాన్ నజీర్ సైతం తీవ్రమైన కీళ్ల వ్యాధితో సతమతమయ్యాడు. దాంతో అతడు కొన్ని రోజులు బ్యాట్ కూడా పట్టలేదు. ఈ క్రమంలో పాక్ బోర్డు నుంచి సహకారం అందుతుందేమో అని వేచి చూసిన నజీర్ కు చేదు అనుభవమే ఎదురైంది. దాంతో ఇమ్రాన్ నజీర్ తీవ్ర మనోవేదనతో కుంగుబాటుకు లోనైనట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అటు జట్టులో స్థానం సంపాదించుకోలేక, ఇటు గాయాలతో సతమతమవుతూ.. పాక్ క్రికెట్ లో నరకం అనుభవించాడనే చెప్పుకోవాలి.
ఈ క్రమంలోనే జట్టు నుంచి నజీర్ స్థానం కోల్పోవడంతో అతడి అభిమానులు.. ఇమ్రాన్ పాక్ లో పుట్టడమే అతడికి శాపంగా మారిందని పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేశారు. ఇక ఇమ్రాన్ నజీర్ కెరీర్ విషయానికి వస్తే.. 8 టెస్టు మ్యాచ్ లు ఆడిన అతడు 2 శతకాలు, ఒక అర్దశతకంతో 427 పరుగులు చేశాడు. 79 వన్డేల్లో 1895 పరుగులు చేశాడు. 25 టీ20ల్లో 135 స్ట్రైక్ రేట్ తో 500 రన్స్ చేశాడు. అయితే అతడి గణాంకాలు తక్కువగానే ఉండోచ్చు.. కానీ నజీర్ విధ్వంసాన్ని మాత్రం మెచ్చుకోక తప్పదు. నజీర్ తన రిటైర్మెంట్ అనంతరం చారీటీ మ్యాచ్ లు ఆడుతూ.. అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు అండగా నిలబడుతున్నాడు.