ప్లేస్ మారింది.. గ్రౌండ్ మారింది ఈసారైనా మనోళ్ల బ్యాటింగ్ మారిద్దేమో అని ఆశపడ్డ భారత క్రికెట్ అభిమానులకు నిరాశే ఎదురైంది. కానీ, ఓవల్ స్టేడియంలో శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్‌తో రికార్డుల మోత మోగింది. సిక్సర్ బాది హాఫ్‌సెంచరీ చేసిన శార్దూల్ ఠాకూర్ సెహ్వాగ్ స్టైల్‌లో బ్యాటింగ్ చేయడమే కాదు.. సెహ్వాగ్ చేసిన ఫాస్టెస్ట్ ఫిప్టీ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. అతి వేగవంతమైన అర్ధ సెంచరీ (31 బంతుల్లో) సాధించిన రెండో బ్యాట్స్‌మెన్‌గా శార్దూల్ నిలిచాడు. తొలిస్థానంలో కపిల్ దేవ్(30 బంతుల్లో ఫిఫ్టీ), మూడో స్థానంలో సెహ్వాగ్(32 బంతుల్లో) ఉన్నారు.
ఇక, ఇంగ్లాడ్ గడ్డపై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన బ్యాట్స్‌మన్‌గా శార్దూల్ రికార్డు నెలకొల్పాడు. 1986లో ఇదే ఓవల్ స్టేడియంలో ఇయామ్ బోథమ్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రికార్డును శార్దూల్ బ్రేక్ చేశాడు. అతని మెరుపు బ్యాటింగ్(57)తో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 191 పరుగులు సాధించింది. అంత మంది బ్యాట్స్‌మెన్లు విఫలమైన పిచ్‌లో అతను ఎలా స్కోర్ చేయగలిగాడు అన్నదే అందిరి ప్రశ్న. ఆ ప్రశ్నకు శార్దూల్ ఠాకూర్ సమాధానమిచ్చాడు. ‘ఇంగ్లాండ్ పిచుల్లో స్ట్రైట్ బ్యాట్‌తోనే పరుగులు సాధించగలం. అక్కడ బంతి ఎక్కువగా స్వింగ్, సీమ్ అవుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో డ్రైవ్‌లు ఆడటం చాలా కష్టంగా ఉంటుంది. స్ట్రైట్ బ్యాట్‌తోనే పరుగులు చేయడం సాధ్యం’ అని తన ధనాధన్ బ్యాటింగ్ సీక్రెట్ బయటపెట్టాడు శార్దూల్ .
ఇక, నాలుగో టెస్టు తొలిరోజు ఆట ముగిసే సరికి ఇంగ్లాండ్ స్కోర్ 53/3. బుమ్రా అద్భుతమైన బౌలింగ్‌తో ఓపెనర్లను పెవిలియన్‌కు పంపాడు. అప్పుడే నిలదొక్కుకుంటున్న కెప్టెన్ రూట్‌ని ఉమేష్ ఔట్ చేశాడు. అదే ప్రదర్శన రెండో రోజు కూడా కొనసాగిస్తే ఇంగ్లాండ్‌ని ఆలౌట్ చేయడం చాలా సులభమే.