Sourav Ganguly: గంగూలీని దాదా అని ఎందుకంటారో ఇప్పటి చాలా మంది నిబ్బానిబ్బి క్రికెట్ ఫ్యాన్స్‌కు తెలియదు. బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, టీమిండియా మాజీ కెప్టెన్‌గా మాత్రమే తెలుసు.. కానీ, గంగూలీ అంటే ఒక వ్యక్తి కాదు.. భారత క్రికెట్ తలరాతను మార్చిన ఒక శక్తి.
సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ.. ఇద్దరూ భారత మాజీ కెప్టెన్లు. అందులోనూ గొప్ప ఆటగాళ్లు కూడా. తమ ఆటతో ఇండియన్ క్రికెట్‌కు ఎంతో చేశారు. అయితే.. ఇప్పుడు వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. టీమిండియా కెప్టెన్‌గా ఉన్న కోహ్లీని బీసీసీఐ అధ్యక్ష పదవిలో ఉన్న గంగూలీ తప్పించాడని, దాన్ని కోహ్లీ మనసులో పెట్టుకున్నాడనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. ఐపీఎల్ 2023లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ-గంగూలీ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోకపోవడం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో.. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు స్పష్టమైంది. అయితే.. ఈ వివాదాన్ని ఆసరాగా చేసుకోని.. కొంతమంది కోహ్లీ అభిమానులు.. గంగూలీని కించపరుస్తూ, తక్కువ చేస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర మేసేజ్‌లు చేస్తున్నారు. కోహ్లీ కింగ్ అని, ఇండియన్ క్రికెట్‌లో అగ్రెసివ్ కెప్టెన్ అని, ఇండియాలో కోహ్లీ మించిన కెప్టెన్ లేడంటూ పేర్కొంటున్నారు. అలాంటి భ్రమల్లో ఉన్న వారి కోసమే ఈ వ్యాసం..
సౌరవ్ గంగూలీ అలియాస్ దాదా.. టీమిండియాకు మాజీ కెప్టెన్‌గా, బీసీసీఐకి తాజా మాజీ అధ్యక్షుడిగా మాత్రమే ఇప్పటి యువ క్రికెట్ అభిమానులకు తెలుసు. కానీ.. గంగూలీ ప్రస్థానం వారికి పూర్తిగా తెలియదు. దీంతో కోహ్లీపై ఉన్న అభిమానంతో గంగూలీ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. వాటిపై గంగూలీ అభిమానులు సైతం తమ పద్దతిలో స్పందిస్తున్నారు. దాదా అంటే ఏమనుకుంటున్నారు అంటూ ‘బాషా’ రేంజ్‌లో ఎలివేషన్ ఇస్తున్నారు. నిజానికి గంగూలీది బాషాను మించిన ఫ్లాష్ బ్యాక్. అగ్రెసివ్ కెప్టెన్సీ గురించి ఇప్పుడు కోహ్లీని ఉదాహరణగా చెబుతున్నారు.. కానీ అసలు అగ్రెసివ్ కెప్టెన్సీకి అర్థం చెప్పిన కెప్టెన్ దాదా. ఇంతకీ.. గంగూలీని ‘దాదా’ అని ఎందుకంటారో తెలుసా? ఆ దాదా అనే పిలుపు వెనుక ఎంత అగ్రెసివ్‌నెస్ దాగుందో ఇప్పుడు తెలుసుకోండి.
మొహమ్మద్ అజహరుద్దీన్ భారత కెప్టెన్‌గా ఉన్న సమయంలో అతనిపై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇండియన్ క్రికెట్ ఒక్క సారిగా కుదేలైపోయింది. జట్టును నడిపించే నాయకుడు లేడు. అసలు జట్టులో క్రికెట్ ఆడాలనే కసే కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సౌరవ్ గంగూలీ అనే నునూగు మీసాల కుర్రాడు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. ఆ సమయంలో గంగూలీ ముందున్న లక్ష్యం జట్టును గెలిపించడం కాదు.. నిర్మించడం. ముందుగా టీమ్‌లో ప్రక్షాళన చేపట్టిన గంగూలీ.. యువ టాలెంట్‌ను వెతికి పట్టుకున్నాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే లాంటి సీనియర్లను కలుపుకుని పోతూ.. సెహ్వాగ్, యువరాజ్, కైఫ్, హర్భజన్, జహీర్ ఖాన్, ధోని, రైనా లాంటి యువ కికెటర్లను జట్టులోకి తీసుకొచ్చాడు. వాళ్లు ఆరంభంలో విఫలమైనా.. వారికి మద్దతుగా నిలబడ్డాడు. గంగూలీ పెట్టుకున్న నమ్మకాన్ని వాళ్లు కూడా నిలబెట్టుకున్నారు.
ఇలా ఒక పటిష్టమైన జట్టును తయారు చేసుకున్న తర్వాత.. ఇక వేట మొదలుపెట్టాడు. అప్పటి వరకు స్వదేశంలో పులి, విదేశాల్లో పిల్లి అని టీమిండియాపై ఉన్న ముద్రను చెరిపేశాడు. ఆటకు ఆటతో, మాటకు మాటతో, స్లెడ్జింగ్‌కు స్లెడ్జింగ్‌తో సమాధానం చెప్పాడు. అసలు టీమిండియాకు భయం అంటే ఏంటో తెలియకుండా చేశాడు. అందుకు చక్కటి ఉదాహరణ.. 2002లో ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. వాంఖడే వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్.. సిరీస్‌ను కూడా గెలుచుకుంది. దీంతో ఇంగ్లండ్ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్.. జెర్సీ విప్పి వాంఖడే స్టేడియం మొత్తం పరిగెత్తాడు. విజయాన్ని అతిగా సెలబ్రేట్ చేసుకుని భారత్‌ను అవమానించాడు. ఆ వెంటనే ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా.. నాట్‌వెస్ట్ సిరీస్‌లో విజయం సాధించింది. క్రికెట్ మక్కాగా పిలువబడే ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానం బాల్కానీలో టీమిండియా కెప్టెన్ గంగూలీ జెర్సీ విప్పేసి.. గాల్లో గిరాగిరా తిప్పుతూ.. ఫ్లింటాఫ్‌కు ముఖం పగిలిపోయేలా కౌంటర్ ఇచ్చాడు.
గంగూలీ అలా చొక్కా విప్పి సింహనాదం చేస్తుంటే.. భారతీయుల గుండెలు విజయగర్వంతో ఒప్పొంగాయి. దాదా చేసిన ఆ పనితో ఒక్క ఫ్లింటాఫ్‌కే కాదు.. ఇండియన్ క్రికెట్‌ను తక్కువ చేసే ప్రతి వారికి దాదా ఇచ్చిన హెచ్చరిక అది. మేం ఎవరికీ తక్కువ కాదు.. మా దేశంలో మీరు మమ్మల్ని అవమానిస్తే.. మేము కూడా మీ దేశానికి వచ్చి మరీ అవమానించగలం అని చొక్కా విప్పి మరీ చెప్పాడు. అందుకే ఇండియన్ క్రికెట్‌కే కాదు.. మొత్తం ప్రపంచ క్రికెట్‌కు అతనే దాదా. ప్రత్యర్థి జట్లపై దాదాగిరి చేస్తూ.. అగ్రెసివ్ కెప్టెన్సీకి అర్థం చెప్పాడు. ఆస్ట్రేలియా విశ్వవిజేతగా వెలుగొందుతున్న సమయంలోనే వారి గర్వం అణిచిన కెప్టెన్ దాదా. 2003లో భారత్‌తో టెస్టు సిరీస్ ఆడేందుకు ఇండియా వచ్చింది ఆస్ట్రేలియా. అప్పటికే వరుస టెస్టులు గెలుస్తున్న ఆస్ట్రేలియా తమ విన్నింగ్ కౌంట్‌ను పెంచుకునేందుకు సరదాగా భారత్ వచ్చినట్లు.. చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు ఆసీస్ కెప్టెన్ స్టీవా.
దీంతో మళ్లీ గంగూలీ మీటర్ రైజ్ అయింది. టీమిండియాను చిత్తుగా ఓడించి.. తమ వరుస విజయాల సంఖ్యను మరింత పెంచుకుంటామని గర్వం ప్రదర్శించిన స్టీవాకు దిమ్మతిరిగేలా చేశాడు దాదా. టాస్ కోసం స్టీవ్‌ను ఎదురుచూసేలా చేసి.. అతని అహంకారంపై దెబ్బ కొట్టాడు. అలానే వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ చేసి.. ఆస్ట్రేలియా అహాన్ని దెబ్బతీయడంతో కోల్‌కత్తా టెస్టులో విజయం సాధించి ఆస్ట్రేలియా వరుస విజయాలకు బ్రేక్ చేశాడు. ఇలా చాలా సందర్భాల్లో అగ్రెసివ్ కెప్టెన్‌గా టీమిండియాను ముందుండి నడిపించాడు. అప్పుడు దాదా నేర్పిన అగ్రెసివ్ నేచరే కోహ్లీ కూడా కొనసాగించాడు. జట్టులో దాదా నింపిన ఆత్మవిశ్వాసం, భయం తెలియని తెంగిపు, పోరాట స్ఫూర్తి.. జట్టులో వారసత్వంగా వస్తోంది. 2011లో వరల్డ్ కప్ నెగ్గిన జట్టు గంగూలీ తయారు చేసుకుందే. ఆ తర్వాత కోహ్లీకి కూడా బెస్ట్ టీమ్ దొరికింది. దాంతో కోహ్లీ కెప్టెన్‌గా సక్సెస్ అయ్యాడు. కానీ, ఒక జట్టును నిర్మించుకుని, దాన్ని కాచుకుంటూ, దాంతో చరిత్ర సృష్టించడం ఒక్క గంగూలీకే సాధ్యమైంది. అందుకే.. ఇండియన్ క్రికెట్‌లో అగ్రెసివ్ కెప్టెన్ అంటే గంగూలీ.. గంగూలీ అంటే అగ్రెసివ్ కెప్టెన్సీ. ఫిక్సింగ్ ఆరోపణలతో ఆగమ్యగోచరంగా ఉన్న జట్టు తలరాతను మార్చి 2003 వన్డే వరల్డ్ ఫైనల్ ఆడే స్థాయికి తీసుకొచ్చాడు. అది గంగూలీ అంటే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.