పొట్టి ప్రపంచ కప్ లో భాగంగా రెండవ సెమీ ఫైనల్లో టీమిండియా-ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 168 పరుగులు చేసింది. బ్యాటింగ్ లో తడబడ్డ భారత్ ను విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు కాపాడారు. వీరిద్దరు అర్దశతకాలతో కదం తొక్కడంతో టీమిండియా ప్రత్యర్థి ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. ఏ బ్యాటర్ అయినా తాను అవుట్ అవుతానని తెలిస్తే అసలు క్రీజ్ నుంచే బయటికి అడుగుపెట్టడు. కానీ ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్ రిషబ్ పంత్ తన వికెట్ ను పాండ్యా కోసం దానం చేశాడు. తాను అవుట్ అవుతానని తెలిసి కూడా క్రీజ్ దాటి పాండ్యా కోసం వచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
టీమిండియా-ఇంగ్లాండ్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అది టీమిండియా ఇన్నింగ్స్ లో చివరి ఓవర్. ఇంగ్లాండ్ బౌలర్ జోర్డాన్ బౌలింగ్ కు దిగాడు.. క్రీజ్ లో జోరుమీదున్న హార్దిక్ పాండ్యా అప్పుడే వచ్చిన రిషబ్ పంత్ ఉన్నాడు. ఈ ఓవర్ లో 3వ బంతిని జోర్డాన్ యార్కర్ గా సంధించాడు. ఈ బాల్ ను ఆడటంలో పంత్ విఫలం అయ్యాడు. బాల్ నేరుగా వికెట్ కీపర్ బట్లర్ చేతిలోకి వెళ్లింది. నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న పాండ్యా ఎలాగైనా రన్ తీయాలని, రన్ కు వచ్చాడు. పాండ్యా పంత్ దగ్గరికి వచ్చేదాక పంత్ రన్ కు రాలేదు. పంత్ క్రీజ్ దాటకపోతే పాండ్యా అవుట్ అయ్యే ప్రమాదం ఉందని గ్రహించిన పంత్.. అవుట్ అవుతానని తెలిసినప్పటికీ క్రీజ్ దాటి బయటికి వచ్చాడు. అప్పటికే బట్లరు బాల్ ను బౌలర్ జోర్డాన్ చేతికి అందించాడు. దాంతో పంత్ అవుట్ అవ్వక తప్పలేదు.
ఇక ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు పంత్ ను పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నారు. అవుట్ అవుతావని తెలిసినాగానీ నీ వికెట్ ను త్యాగం చేసినందుకు హ్యాట్సాఫ్ బ్రో అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. పంత్ వికెట్ ను ఇచ్చిన వికెట్ ను వృథాగా పోనివ్వలేదు హార్దిక్ నెక్ట్ బాల్ ను లాంగాన్ మీదుగా అద్భుతమైన సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత బాల్ ను బౌండరీకి తరలించాడు పాండ్యా. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో రోహిత్ (27) పరుగులు చేయగా.. కింగ్ కోహ్లీ 40 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్ తో 50 రన్స్ చేశాడు. హార్దిక్ పాండ్యా కేవలం 33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్ లతో 63 పరుగులు చేశాడు. అనంతరం 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ గెలుపు వైపు దూసుకెళ్తోంది. 9 ఓవర్లు ముగిసే వరకు వికెట్ నష్టపోకుండా 91 పరుగులు చేసింది. కెప్టెన్ బట్లర్ 36 పరుగులతో, హేల్స్ 51 పరుగులతో క్రీజ్ లో దుమ్మురేపుతున్నారు.