ఐపీఎల్ 2022 : మెగా వేలానికి మరికొద్ది రోజులే మిగిలి ఉంది. ఫిబ్రవరి 12, 13 వ తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగనుంది. ఇప్పటికే ఆటగాళ్ల రిటెన్షన్, కొత్త జట్ల డ్రాఫ్ట్ ప్లేయర్స్ ప్రక్రియను ముగించిన బీసీసీఐ.. అన్ని అనుకున్నట్లు జరిగితే మార్చి చివరి వారంలో భారత్ వేదికగా లీగ్ ప్రారంభం కానుంది. ఒకవేళ మన దేశంలో సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయంగా విదేశాల్లో అయినా లీగ్ ని కొనసాగించేలా బీసీసీఐ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక మెగా వేలానికి సిద్దమవుతున్న ఫ్రాంచైజీలు.. పకడ్బందీ ప్రణాళికలు రచిస్తున్నాయి. వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నాయి. ఏయే ప్లేయర్‌ను ఎంచుకోవాలి.. ఎంత వరకు పోటీపడాలనే పక్కాలెక్కలను సరి చూసుకుంటున్నాయి. 14 సీజన్లుగా టైటిల్ కోసం నిరీక్షిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఈసారైనా ఆ కలను నెరవేర్చుకోవాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే టీమ్‌ను పటిష్ట పరుచుకోవాలని ఆర్సీబీ మేనేజ్మెంట్ భావిస్తోంది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదులుకోవడం.. దిగ్గజ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లను తీసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను టార్గెట్ చేసిన ఆర్సీబీ.. ఏబీడీ లోటును భర్తీ చేసేందుకు ఇండియన్ వికెట్ కీపర్ ఇషన్ కిషన్‌ను తీసుకోవాలనుకుంటుంది.
ఇది కూడా చదవండి : బిగ్ బాష్ లీగ్ లో విచిత్రం. ఆఖరి బంతికి అదిరిపోయే డ్రామా!
గత సీజన్ లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన ఇషన్ కిషన్ ఆ జట్టు తరఫున మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. వికెట్ కీపర్‌గా జట్టులో ఉన్న అతను ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేస్తూ మెరుపులు మెరిపించాడు. రిటెన్షన్ రూల్స్ ప్రకారం గరిష్టంగా నలుగురిని మాత్రమే తీసుకునే అవకాశం ఉండటంతో ముంబై ఇండియన్స్ అతన్ని వేలంలోకి వదిలేసింది. అయితే ఆక్షన్‌లో మళ్లీ తీసుకుంటామని భరోసా ఇవ్వడంతో అతను కొత్త జట్లలోకి వెళ్లకుండా వేలానికి అందుబాటులో ఉన్నాడు.
భారీ హిట్టింగ్ సామర్థ్యం కలిగిన ఇషన్ కిషన్ తమ టీమ్‌కు సెట్ అవుతాడని భావిస్తోంది ఆర్సీబీ. వికెట్ కీపర్ ఆప్షన్స్‌గా జానీ బెయిర్ స్టో, కేఎస్ భరత్‌లను కూడా పరిశీలిస్తున్న ఆర్సీబీ.. ఇషన్ కిషన్‌నే మొదటి టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా.. ఇషన్ కిషన్ రాకతో ఆర్సీబీకి రెండు సమస్యలు తీరనున్నాయి. ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా.. వికెట్ కీపర్‌గా అతను జట్టులో కీలకం కానున్నాడు. 2 కోట్ల రూపాయల కనీస ధరతో వేలానికి అందుబాటులో ఉన్న ఇషన్ కిషన్‌కు భారీ ధర పలికే అవకాశం ఉంది. వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో పాటు హిట్టింగ్ సామర్థ్యం ఉన్న ఈ జార్ఖండ్ కీపర్ కోసం ఫ్రాంచైజీలన్నీ పోటీపడే అవకాశం ఉంది.