అంతర్జాతీయ క్రికెట్ లో అనితర సాధ్యమైన రికార్డులు తన పేరిట లిఖించుకున్న గ్రేట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రాష్ట్రం నుంచే వచ్చిన నయా డైనమైట్ ఇషాన్ కిషన్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు తిరగ రాశాడు.
విశ్వ సమరానికి ముందు బీసీసీఐ యువ ఆటగాళ్లకు విరివిగా అవకాశాలు ఇస్తుంటే.. వాటిని ఒడిసి పట్టడంలో చాలా వరకు విఫలమవుతున్నారు. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో మన యంగ్ గన్స్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాయి. రెండో వన్డేలో మనవాళ్లు పేలవ ప్రదర్శన కనబర్చడంతో.. కరీబియన్ల చేతిలో పరాజయం తప్పలేదు. అయితే ఇంత నిస్తేజంలోనూ.. యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ నిలకడ కనబరుస్తున్నాడు. ఈ పర్యటనలోనే టెస్టు అరంగేంట్ర చేసిన ఈ వికెట్ కీపర్.. విండీస్ తో రెండో టెస్టులో ధనాధన్ ఆటతో హాఫ్ సెంచరీ నమోదు చేసిన విషయం తెలిసిందే. పరిమిత ఓవర్ల క్రికెట్ లోనూ అదే జోరు కొనసాగిస్తున్న ఇషాన్ వరుసగా రెండో వన్డేల్లో అర్ధశతకం సాధించాడు. ఈ క్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.
రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ ఓపెనర్లుగా కొనసాగుతుండటంతో జాతీయ జట్టు తరఫున ఎక్కువ మ్యాచ్ లు ఆడే అవకాశం దక్కించుకోలేక పోతున్న ఈ జార్ఖండ్ పాకెట్ డైనమైట్.. గత ఏడాది చివర్లో బంగ్లాదేశ్ పై వన్డేల్లో డబుల్ సెంచరీతో కదంతొక్కిన విషయం తెలిసిందే. తాజాగా విండీస్ పై తొలి రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలు బాదిన ఇషాన్.. టీమిండియా తరఫున వరుసగా ఐదు ఇన్నింగ్స్ ల్లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. గతంలో ఈ రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఓపెనర్ గా సచిన్ వరుసగా 5 వన్డేల్లో 321 పరుగులు చేయగా.. ఇషాన్ కిషన్ 348 రన్స్ తో మాస్టర్ బ్లాస్టర్ రికార్డును తిరగరాశాడు.
ఈ జాబితాలో శుభ్ మన్ గిల్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ పై డబుల్ సెంచరీ సహా వరుసగా ఐదు ఇన్నింగ్స్ ల్లో గిల్ 320 పరుగులు చేశాడు. దీంతో పాటు వెస్టిండీస్ పై వరుస మ్యాచ్ ల్లో అర్ధశతకాలు సాధించిన భారత వికెట్ కీపర్ గా.. మహేంద్ర సింగ్ ధోనీ ని ఇషాన్ సమం చేశాడు. 2017 విండీస్ పర్యటనలో భాగంగా మహీ.. వరుస మ్యాచ్ ల్లో అర్ధశతకాలు సాధించగా.. ఇప్పుడు ఇషాన్ తన ఆరాధ్య ఆటగాడి సరసన చేరాడు. మూడో వన్డేలోనూ ఇదే జోరు కొనసాగిస్తూ.. మరో ఫిఫ్టీ కొడితే.. మహీని మించి కరీబియన్లపై హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక భారత వికెట్ కీపర్ గా నిలువనున్నాడు. మరి మాస్టర్ బ్లాస్టర్ రికార్డును ఇషాన్ కిషన్ బద్దలు కొట్టడం మీకు ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియచేయండి