ఈ ఫొటోలో కనిపిస్తున్న పాల బుగ్గల పసివాడిని గుర్తు పట్టారా? చేతిలో ట్రోఫీ, ముఖంపై చిరునవ్వు, కళ్లలో తేజస్సుతో కనిపిస్తున్న ఈ చిన్నోడు మరెవరో కాదు! మహేంద్రసింగ్ ధోనీ రికార్డులు తిరగరాయడమే పనిగా పెట్టుకున్న భారత ఆటగాడే!
ఫొటోలో ఉన్నదెవరో ఇంకా అర్థం కాలేదా.. దిగ్గజ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రికార్డును తిరగరాశాడంటేనే.. అతడో వికెట్ కీపర్ బ్యాటర్ అయి ఉంటాడని ఊహించవచ్చు. ఇక తాజాగా భారత జట్టులో వికెట్ కీపర్ సేవలందిస్తూ.. నిలకడగా పరుగులు రాబడుతుందోవరో తెలిసిందేగా. ఆ.. అతడే! మీరు ఊహించింది సరైందే. ఈ చిత్రంలో ఉన్నది పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషనే. వెస్టిండీస్‌తో రెండో టెస్టులో ధనాధన్ హాఫ్ సెంచరీతో టచ్‌లోకి వచ్చిన ఈ జార్ఖండ్ ప్లేయర్.. వన్డే సిరీస్‌లో చెలరేగిపోయాడు. రాంచీ నుంచే వచ్చిన జులపాల వీరుడు ధోనీని తలపిస్తూ.. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ అర్ధశతకాలు బాదాడు.
రోహిత్ శర్మ గైర్హాజరీలో ఓపెనర్‌గా తన బాధ్యతను నిర్వర్తించిన ఇషాన్.. మూడు మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు బాదాడు. తద్వారా ఈ ఘనత సాధించిన భారత రెండో వికెట్ కీపర్‌గా మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ సరసన చేరాడు. గతంలో ధోనీ ఆస్ట్రేలియాపై ఇలా వరుసగా మూడు వన్డేల్లో అర్ధశతకాలు సాధించగా.. ఇప్పుడు ఇషాన్ విండీస్‌పై సేమ్ సీన్ రిపీట్ చేశారు. భారత క్రికెట్ చరిత్రలో ఇలా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మూడు హాఫ్‌సెంచరీలు చేసిన వికెట్ కీపర్లు వీరిద్దరే! ఓవరాల్‌గా గతంలో కృష్ణమాచారి శ్రీకాంత్, దిలీప్ వెంగ్‌సర్కార్, మహమ్మద్ అజహరుద్దీన్, శ్రేయస్ అయ్యర్ ఈ ఘనత సాధించారు.
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున దంచికొడుతూ.. జాతీయ జట్టులోకి వచ్చిన ఇషాన్.. గతేడాది బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. పిట్ట కొంచం కూత ఘనంలా.. చెలరేగిపోయే ఇషాన్ భారీ షాట్లు ఆడటంలో నేర్పరి. అయితే నిలకడలేమి కారణంగా జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయిన కిషన్.. ఈ పర్యటనలో మెరుగైన ప్రదర్శన చేశాడు. ఈ టూర్ ద్వారానే టెస్టు అరంగేట్రం చేసిన ఇషాన్.. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీ20 తరహా ఇన్నింగ్స్ ఆడి ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇషాన్ వరుసగా 52, 55, 77 పరుగులు చేసి అదుర్స్ అనిపించాడు. దీంతో మూడు మ్యాచ్‌ల్లో కలిపి 184 పరుగులు చేసిన ఇషాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు ట్రోఫీ దక్కింది. కాగా.. చిన్నప్పుడు ఓ స్థానిక టోర్నీలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నప్పటి పాత చిత్రంతో పాటు.. తాజా ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.