పొట్టి ప్రపంచ కప్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది టీమిండియా. అందుకు తగ్గట్టే ప్రాక్టీస్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి బలమైన జట్లను మట్టికరిపించింది. ఇక చిరకాల ప్రత్యర్థి అయినా పాక్‌తో మ్యాచ్‌తో టీ20 వరల్డ్ కప్ వేట ప్రారంభించనున్న టీమిండియా అదరగొట్టడం ఖాయమని అంతా భావించారు. కానీ ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ప్రదర్శన చూస్తే మాత్రం ఘోరంగా ఉంది. మ్యాచ్ విన్నర్లు, హార్డ్ హిట్టర్లు, యువ సంచలనాలతో పేపర్‌పై భీకరంగా కనిపించిన జట్టు మైదానంలో మాత్రం పసికూన కంటే దారుణంగా ఆడుతుంది.
ఇప్పటి వరకు ఐసీసీ ఈవెంట్లలో పాకిస్తాన్‌పై ఉన్న ఘనమైన రికార్డును పోగొట్టుకున్న టీమిండియా, న్యూజిలాండ్‌కు మనపై ఉన్న రికార్డుకు మాత్రం బ్రేక్ వేయలేకపోయింది. మొట్టమొదటి సారి 2007లో టీ20 వరల్డ్ కప్ నెగ్గిన భారత్ పొందిన ఒకే ఒక్క ఓటమి న్యూజిలాండ్ చేతిలోనే. ఆ తర్వాత జరిగిన ప్రతి ఐసీసీ మెగా ఈవెంట్లలో న్యూజిలాండ్ మనపై పైచేయి సాధించింది.
ఇంత దారుణ ప్రదర్శనకు కారణం ఐపీఎల్?
టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా సెమీస్ చేరడం దాదాపు అసాధ్యం. టోర్నీ మొదలై రెండు మ్యాచ్‌లు ఆడగానే ఒక పసికూన జట్టుపై వచ్చే అంచనాలు ఇప్పుడు భారత్‌పై వచ్చేశాయి. గ్రూప్ 2లో ఉన్న జట్లలో సెమీస్ చేరే జట్లు ఏవంటే పాక్, కివీస్, ఆఫ్గానిస్తాన్ మధ్య పోటీ నెలకొంది. భారత్ మాత్రం స్కాట్‌ల్యాండ్, నమిబియా సరసన చేరింది. ఇంతటి దారుణమైన స్థితికి ఐపీఎల్ కారణమని నెటిజన్లు, క్రికెట్ అభిమానులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: కోహ్లీ సేన సెమీస్ చేరాలంటే.. అద్భుతాలు జరగాలి!
సెప్టెంబర్ నెలలో జరిగిన ఐపీఎల్ 2021 రెండో దశలో ప్రస్తుతం భారత్ జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ పాల్గొన్నారు. విరామం లేకుండా సాగిన ఐపీఎల్ మ్యాచ్‌లతో టీమిండియా ప్లేయర్లు అలిసిపోయారని నిపుణులు భావిస్తున్నారు. పైగా ఐపీఎల్‌లో ఆడినంత శ్రద్ధంగా ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ టోర్నీలో ఆడటం లేదని, ఇండియన్ ప్లేయర్లు ఐపీఎల్‌లో వచ్చే డబ్బుపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు, అందుకే అధికంగా శ్రమించి ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన ఇచ్చి, వరల్డ్ కప్‌కు వచ్చేసరికి అలిసిపోయి కనిపిస్తున్నట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది ప్లేయర్లపైన సోషల్ మీడియాలో దాడి కూడా చేస్తున్నారు.
ఒత్తిడి.. స్వయం కృతమా?
టీమిండియా వైఫల్యానికి ఐపీఎల్‌తో పాటు అధిక ఒత్తిడి కూడా ప్రధాన కారణంగా క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కచ్చితంగా వరల్డ్ కప్ గెలవాలి అనే ఒత్తిడి, టోర్నీ ప్రారంభంలోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్. ఆ మ్యాచ్‌కు వచ్చిన హైప్, భావోద్వేగాల మధ్య జరిగిన ఆ మ్యాచ్ భారత్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచింది. పైగా టీమిండియా మాజీ కెప్టెన్ ధోనిని మెంటర్‌గా నియామకం జట్టులో ఏదో లోటు ఉన్నట్లు ఆటగాళ్లు జట్టు పరంగా ఆత్మరక్షణ ధోరణిలోకి వెళ్లేలా చేసింది. అయినా భారత్ భారీ అంచనాల మధ్య జరిగినా ఏ టోర్నీలోనూ మెప్పించలేదు. ఇప్పటి వరకు గెలిచిన ప్రతి ఐసీసీ కప్ కూడా అంచనాలు ఏమాత్రం లేకుండా అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగి నెగ్గిందే.
భారత్‌పై ఉన్న ఒత్తిడికి తోడు టాస్ కూడా ఇక్కడ కీలకంగా మరింది. టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లే అనే భావన వచ్చేసింది. దురదృష్టం ఏమిటంటే భారత్ ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ టాస్ ఓడిపోయింది. టాస్ సంగతి పక్కన పెడితే టీమిండియా ప్రదర్శన కూడా మరీ ఫేలకంగా ఉంది. రెండు మ్యాచ్‌లలోనూ ఏ దశలో కూడా కనీస పోటీ ఇవ్వలేక పోయింది. మరి టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా వరుస ఓటములపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: హార్దిక్ పాండ్యా చేసిన అతి పెద్ద పొరపాటు.. మూల్యం చెల్లిస్తున్న టీమిండియా!