ఐపీఎల్ 2022లో 8వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. ఈ రెండు జట్లు కూడా విజయంతోనే టోర్నీని ఆరంభించాయి. కోల్‌కోత్తా తమ రెండో మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓడింది. ఆ ఓటమిని మరిచి.. మళ్లీ విజయాల బాట పట్టేందుకు కేకేఆర్ రెడీ అవుతుంది. పంజాబ్ కింగ్స్ తొలి మ్యాచ్‌లో గెలిచి.. రెండో గెలుపుకోసం సిద్ధమైంది. మరి ఈ రెండు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం..
కోల్‌కత్తా నైట్ రైడర్స్..
కేకేఆర్‌కు ఒక సీనియర్ ప్లేయర్, ఒక యంగ్ ప్లేయర్ రూపంలో మంచి ఓపెనింగ్ జోడి ఉన్నా.. గత రెండు మ్యాచ్‌లలో కూడా మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేయలేదు. ఓపెనర్లు ఇద్దరు రాణిస్తేనే భారీ స్కోర్‌చేసే అవకాశం ఉంది. వన్‌డౌన్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, మిడిల్దార్‌లో నితిష్ రాణా, సామ్ బిల్టింగ్స్, జాక్సన్ ఉన్నారు. రాణా, జాక్సన్ రెండు మ్యాచ్‌లలో కూడా విఫలం అయ్యారు. మరి ఈ మ్యాచ్‌తోనైనా పుంజుకుంటే బెటర్. చివర్లో హిట్టింగ్ కోసం రస్సెల్ ఉండనే ఉన్నాడు. సమస్య ఓపెనింగ్, మిడిల్డార్‌లోనే ఉంది. కేకేఆర్ బ్యాటింగ్ కంటే కూడా బౌలింగ్ దుర్భేద్యంగా ఉంది. పేస్‌లో ఉమేష్ యాదవ్, టీమ్ సౌథీ.. స్పిన్‌లో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్‌తో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. రెండు మ్యాచ్‌లను గమనిస్తే.. కేకేఆర్ బౌలింగ్‌తోనే ఆకట్టుకుంది.
పంజాబ్ కింగ్స్..
తొలి మ్యాచ్‌లో భారీ స్కోర్‌ను ఛేదించి గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ పరంగా బాగున్నా.. బౌలింగ్‌లో మాత్రం తేలిపోయింది. బ్యాటింగ్‌లో కెప్టెన్ మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, శ్రీలంక ఆటగాడు భానుక రాజపక్సే పంజాబ్‌కు ప్రధాన బలం. అదేవిధంగా ఓడియన్ స్మిత్, షారుఖ్ ఖాన్ బ్యాట్ ఝుళిపిస్తే.. పంజాబ్‌కు బ్యాటింగ్‌లో తిరుగుండదు. ముందు చెప్పుకున్నట్లు బౌలింగ్ విషయంలో పంజాబ్ కొంచెం బలహీనంగా ఉంది. సందీప్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, ఒడియన్ స్మిత్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్‌ల స్పిన్ ద్వయం కూడా మెరుగ్గా రాణించాల్సి ఉంది. పంజాబ్ బ్యాటింగ్ కలిసొచ్చే విషయం ఏమిటంటే.. కగిసో రబడా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. రబడా రాకతో పంజాబ్ బౌలింగ్ కాస్త మెరుగుపడే అవకాశం ఉంది.
హెడ్ టూ హెడ్..
కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఇప్పటివరకు మొత్తం 29 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో కేకేఆర్ 19 మ్యాచ్‌లు, పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్‌లు గెలిచాయి. గత సీజన్‌లో కోల్‌కతా ఐదు వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడిస్తే మరో మ్యాచ్‌లో పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో కోల్‌కతాను ఖంగు తినిపించింది. 2020లో కూడా చెరో ఒక్కో విజయం సాధించారు. దీంతో ఈసారి కూడా రెండు జట్ల మధ్య గట్టి పోటీ ఉంటుందని భావించవచ్చు.
పిచ్..
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ పిచ్‌పై బ్యాటింగ్ అంత సులువు కాదు. బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. టాస్ కూడా కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
ప్రిడిక్షన్..
ఇరు జట్ల బలాలు, బలహీనతలు పరిశీలించిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ విజయం సాధించే అవకాశం ఉంది. బ్యాటింగ్‌లో ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నా.. కేకేఆర్ బౌలింగ్‌ను ఎదుర్కొవడం పంజాబ్‌కు కత్తిమీద సామే. కేకేఆర్ తమ తొలి రెండు మ్యాచ్‌లలో ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కే పరిమితం చేసిన విషయం తెలిసిందే. ఇక బ్యాటింగ్‌లో ఓపెనర్లు, శ్రేయస్ అయ్యర్ రాణిస్తే.. పంజాబ్‌కు ఓటమి తప్పదు.
తుది జట్ల అంచనా..
కోల్‌కత్తా.. శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అజింక్యా రహానే, వెంకటేశ్ అయ్యర్, నితిష్ రాణా, సామ్ బిల్లింగ్స్, షెల్డన్ జాక్సన్, ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, టీమ్ సౌథీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
పంజాబ్.. మయాంక్ అగర్వాల్(కెప్టెన్), శిఖర్ ధావన్, లివింగ్‌స్టన్, భానుక రాజపక్స, షారుఖ్ ఖాన్, ఓడియన్ స్మిత్, రాజ బవా, కగిసో రబడా, హర్పీత్, సందీప్ శర్మ, రాహుల్ చాహర్.
ఇదీ చదవండి: కోహ్లీ చేసిన పనికి రచ్చ! కోహ్లీ vs అయ్యర్!
𝙉𝙀𝙒 𝘿𝘼𝙔. 𝙉𝙀𝙒 𝘾𝙃𝘼𝙇𝙇𝙀𝙉𝙂𝙀. 👊#KKRHaiTaiyaar #KKRvPBKS #IPL2022 pic.twitter.com/4zMw2xa2Zi
— KolkataKnightRiders (@KKRiders) April 1, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.