టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా తన చివరి మ్యాచ్‌ను ఆదివారం నమీబియాతో ఆడి ఈ టోర్నీను నిష్ర్కమించనుంది. ఆ తర్వాత ఈ నెల 17ను స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా జట్టులో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఐపీఎల్‌తో వచ్చిన అలసటతోనే టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఆటగాళ్లు మంచి ప్రదర్శన ఇవ్వలేకపోయారనే అభిప్రాయం ఒకటి వార్తలో నిలిచింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని టీమిండియాలో నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో బీసీసీఐ సెలక్టర్లు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, బుమ్రా, మొహమ్మద్ షమి, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్‌కు రెస్ట్ ఇచ్చి ఒక కొత్త జట్టుతో టీమిండియా బరిలోకి దిగనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఎలాగో టీ20 వరల్డ్ కప్‌లో మిగిలిన ఒక మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ టీ20 జట్టు కెప్టెన్ తప్పుకుంటాడు. ఇక బాధ్యతను రోహిత్ శర్మకు అప్పగించి అతని సారథ్యంలో ఒక కొత్త జట్టును న్యూజిలాండ్ సిరీస్ కోసం ప్రకటించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తుంది. దాంతో రోహిత్ శర్మ తన వ్యూహాలను పక్కాగా అమలు చేసే అవకాశం ఉంటుందని వారి అంచనా. అలాగే వన్డే కెప్టెన్‌గా కూడా రోహిత్‌ను నియమించి కోహ్లీని టెస్ట్ జట్టు కెప్టెన్‌గా కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే న్యూజిలాండ్‌తో సిరీస్‌లో టీమిండియా తరఫున యువ ఆటగాళ్లు అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
వీరిలో ప్రధానంగా ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ తరఫున ఓపెనర్‌గా అదరగొట్టిన వెంకటేశ్ అయ్యర్, చెన్నై యువ సంచలనం రుతురాజ్ గైక్వాడ్ టీమిండియా టీ20 జట్టులోకి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నట్లు తెలుస్తుంది. వెంకటేశ్ అయ్యర్ యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2021 రెండో భాగంలో 9 మ్యాచ్‌లు ఆడి 320 పరుగులు చేసి 3 వికెట్లు కూడా పడగొట్టాడు. అలాగే రుతురాజ్ 16 మ్యాచ్‌ల్లో 635 పరుగులు చేసి చెన్నై టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. మరి న్యూజిలాండ్‌తో సిరీస్ కోసం టీమిండియాలో చేయనున్న మార్పులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.