కళ్లు మూసి తెరిచే లోపల మాయమయ్యే కార్లు.. జుప్ జుప్ మంటూ వచ్చే శబ్దాలు.. గూస్ బంప్స్ తెప్పించే విన్యాసాలు. నేను చెప్పేది ఏదో హాలీవుడ్ మూవీ గురించి కాదండి బాబు. త్వరలో హైదరాబాద్ లో మీరు చూడబోయే విన్యాసాల గురించి. క్రీడల గురించి తెలిసిన వారికి కొద్దో గొప్పో ఫార్ములావన్ రేసు గురించి కచ్చితంగా తెలిసే ఉంటుంది. ఈ రేసులు ఎక్కువగా విదేశాల్లో జరుగుతుంటాయి. ఇక ఈ రేసుకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు కోకొల్లలుగా ఉన్నారు. అయితే ఇలాంటి రేసును మనం త్వరలోనే హైదరాబాద్ లో చూడబోతున్నాం. ఇండియన్ రేసింగ్ లీగ్ (IRL)లో భాగంగా హైద్రాబాద్ స్ట్రీట్ సర్క్యూట్, మోటార్ స్పోర్ట్స్ కలిసి అభిమానుల్ని ఉర్రూతలూగించడానికి రడీ అయ్యింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఫార్ములావన్ రేసు.. ప్రపంచ వ్యాప్తంగా మస్త్ క్రేజ్ ఉన్న క్రీడ. ఫార్ములావన్ రేసింగ్ లో పాల్గొనాలని ప్రతీ రేసర్ కలకంటాడు. ఈ నేపథ్యంలోనే భారత్ లో ఉన్న ప్రతిభావంతుల కోసం ఏర్పాటు చేసిందే ఇండియన్ రేసింగ్ లీగ్. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఇండియాలో జరగనున్న మెుట్టమెుదటి FIA ఫార్ములా – ఇ రేసు హైద్రాబాద్ లో జరగనుంది. ప్రస్తుతం జరిగే ఈ రేసు సర్క్యూట్ ట్రయల్ రన్ లా పనిచేయనుంది.
మోటార్ స్పోర్ట్స్ లో ఫార్ములావన్ రేసుది అగ్రస్థానం. దాంతో చాలా మంది డ్రైవర్లు నేరుగా ఈ రేసులో పాల్గొనడం కుదరదు. ఫార్ములావన్ లో పాల్గొనాలి అంటే దశల వారిగా వెళ్లాలి. మెుదటగా F4తో ప్రారంభించి.. F3, F2 స్థాయిలకి చేరుకోవాలి. వీటన్నింటిలో అత్యున్నత ప్రదర్శన ఇచ్చిన వారే ఫార్ములావన్ రేసుకు అర్హత సాధిస్తారు. అందులో భాగంగానే ఇండియాలో ఉన్న ప్రతిభావంతమైన రేసర్ల కోసం ఏర్పాటు చేసిందే ఇండియాన్ రేసింగ్ లీగ్. ప్రస్తుతం రేసింగ్ లో 6 జట్లు.. 24 మంది డ్రైవర్లు పాల్గొంటున్నారు. వీరిలో 12 మంది విదేశీ రేసర్లు కాగ మిగిలిన వారు మనోళ్లు.
6 టీమ్ లు.. 24 డ్రైవర్లు పాల్గొనే ఈ రేసు నాలుగు రౌండ్లపాటు జరుగుతుంది. ఈనెల 19, 20 తేదీల్లో ఫస్ట్ రౌండ్, డిసెంబర్ 10, 11 తేదీల్లో నాలుగో రౌండ్ కు హైద్రాబాద్ వేదికగా నిలవనుంది. రెండు, మూడో రౌండ్ లకు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుంది. హుస్సేన్ సాగర్ తీరంలో 2.7 కి.మీ ట్రాక్ ను ఎన్టీఆర్ గార్డెన్స్ చుట్టూ అన్ని హంగులతో ఏర్పాటు చేస్తున్నారు. ప్రేక్షకులు ఈ రేసును ప్రత్యక్షంగా చూడాలి అనుకుంటే బుక్ మై షో.కామ్ లో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ రేసులను స్టార్ స్పోర్ట్స్ 2 ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
ఇండియాలో జరుగుతున్న తొలి ఇండియన్ రేసింగ్ లీగ్ లో.. మన తెలుగు తేజం బరిలోకి దిగబోతున్నాడు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సంగీతారెడ్డి దంపతుల కొడుకు అనిందిత్ రెడ్డి ఈ రేసులో పాల్గొనబోతున్నాడు. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ జట్టు తరపున అనిందిత్ రెడ్డి బరిలో ఉన్నాడు. రేసింగ్ ట్రాక్ పై తనదైన ముద్ర వేసుకున్నాడు ఈ యువ రేసర్. రేసింగ్ లో ఏడేళ్ల అనుభవం ఉన్న అనిందిత్ రెడ్డి.. 2016లో యూరో JK16 ఛాంపియన్ షిప్, 2017లో యూరో జేకే ఛాంపియన్ షిప్ లలో విజేతగా నిలిచాడు. అదీకాక మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా 2017 మోటార్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ను గెలుచుకున్నాడు.