ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ జిల్లాలోని రతై పూర్వ అనే ఓ మారుమూల గ్రామానికి చెందిన అర్చనా దేవి అండర్19 వరల్డ్ కప్ గెలిచిన ఇండియన్ టీమ్‌లో సభ్యురాలు. ఎక్కడో చిన్న పల్లెటూరు నుంచి వచ్చి.. భారత అండర్ 19 జట్టుకు ఆడటమే కాకుండా.. ఇండియాకు వరల్డ్ కప్ కూడా అందించింది. నిజంగా మట్టిలోని మాణిక్యం కదా. నిజమే.. అర్చనా దేవి మట్టిలోని మాణిక్యమే. కానీ.. ఆమె తల్లి మాత్రం ఓ యోధురాలు. ‘ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు’ ఈ మాటకు నిలువెత్తు రూపం సావిత్రి దేవి. కూతురి కోసం ఆమె చేసిన పోరాటం ఏంటో.. ఆమె వల్ల దేశానికి ఒక వజ్రంలాంటి క్రికెటర్ ఎలా దొరికిందో ఇప్పుడు తెలుసుకుందాం..
క్యాన్సర్‌తో 16 ఏళ్ల క్రితమే భర్త మరణించాడు. ఊరంతా భర్త చేసిన అప్పులకు తోడు ముగ్గురు పసి పిల్లలను పోషించాల్సిన బాధ్యత ఆమెపై పడింది. భర్త చనిపోయిన బాధను దిగమింగుతూనే.. కూలీ నాలి చేసుకుంటూ.. ముగ్గురు పిల్లలకు నాలుగు మెతుకులు పెడుతూ వచ్చింది. కానీ.. అనుకోకుండా ఒక రోజు చిన్నకొడుకు, అర్చనా దేవి తమ్ముడు పాము కాటుతో మరణించాడు. అర్చనా అతని తమ్ముడు బుద్దిమాన్‌తో కలిసి క్రికెట్ ఆడుతున్న సమయంలో.. అర్చనా కొట్టిన బాల్ వాళ్ల ఇంట్లోనే ఒక పాడుబడిన గదిలోకి వెళ్లిపడింది. తండ్రి చనిపోయిన తర్వాత.. ఆ గది నిర్మాణ పూర్తి చేసే స్థోమత లేకపోవడంతో దాన్ని అలాగే వదిలేశారు. అయితే.. అక్క కొట్టిన బాల్‌ను తీసుకొచ్చేందుకు ఆ గదిలోకి వెళ్లిన బుద్దిమాన్ బాల్ వెతికే క్రమంలో పాము కాటుకు గురై చనిపోయాడు.
ఒకవైపు భర్తను మరోవైపు చిన్నకొడుకు కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయి ఉన్న సావిత్రి దేవిపై.. ఊరి జనం కాస్త కూడా కనికరం చూపకుండా.. మంత్రగత్తె అంటూ ముద్రవేశారు. మొదట భర్తను, ఆ తర్వాత కొడుకును మింగేసిందంటూ.. సావిత్రి దేవిపై నిందలు మోపారు. ఆమె ఇంట్లో పచ్చి మంచినీళ్లు కూడా ఆ ఊరి జనం తాగే వారు కాదు. ఏ శుభకార్యానికి ఆ కుటుంబానికి ఆహ్వానం ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే.. సావిత్రి దేవి, ఆమె ఇద్దరు పిల్లలు ఊరిలో వెలివేసిన వారిలో ఉన్నారు. అయినా కూడా పిల్లల కోసం గుండె రాయి చేసుకున్న సావిత్రి దేవి.. గొడ్డు కష్టం చేస్తూనే.. పిల్లలిద్దరిని పోషించింది. తన కూతురికి క్రికెట్‌పై ఉన్న ఆసక్తిని గమనించిన సావిత్రి.. అర్చనా దేవిని తీసుకెళ్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చేర్పించింది. చదువుతో పాటు ఆటలోను ప్రొత్సహిస్తారనే ఆశతో.
కానీ.. చుట్టాలు మాత్రం కుతూరిని అమ్మేసిందని, తప్పుడు దారిలో ఉసిగొల్పుతుందని అభాండాలు వేశారు. కొన్నేళ్ల వారకు ఊరి జనాల నుంచి మంత్రగత్తె అంటూ.. చుట్టాల నుంచి కూతుర్ని అమ్ముకుందనే నిందలు భరిస్తూనే.. పెద్ద కొడుకు రోహిత్‌తో కలిసి కొంత కాలం వెళ్లదీసింది. లాక్‌డౌన్‌కు ముందు ఢిల్లీని ఒక బట్టల ఫ్యాక్టరీలో పెద్ద కొడుకు రోహిత్ పనికి కుదిరాడు. కానీ.. లాక్‌డౌన్ సమయంలో రోహిత్ ఉద్యోగం పోవడంతో.. మరోసారి పిల్లలిద్దరి పోషణాభారం మళ్లీ సావిత్రిపైనే పడింది. పూట గడవడే కష్టంగా ఉన్న సమయంలో.. కూతురిని క్రికెటర్ చేసి.. దేశం గర్వపడేలా చేయాలనే ఆమె ఆశ మసకబారుతున్న సమయంలో.. టీమిండియా క్రికెటర్ కుల్దీప్ యాదవ్ కోచ్ పాండే.. అర్చనా దేవి గురించి తెలుసుకుని.. ఆమెకు ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చే బాధ్యతను తీసుకున్నాడు.
అర్చనా దేవిలో అద్భుతమైన టాలెంట్ ఉందని.. ఏదో ఒక రోజు దేశం గర్వించే క్రికెటర్ అవుతుందంటూ.. ఆమెకు తన సొంత డబ్బుతో అకాడమీలో చేర్పించి.. ట్రైనింగ్ ఇచ్చారు. ఖాన్పూర్‌లో కుల్దీప్ యాదవ్ కోచ్ పాండే కోచింగ్‌లో రాటుదేలిన అర్చనా దేవి.. టీమిండియా అండర్ 19కు ఎంపికైంది. వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవడమే కాకుండా.. ఫైనల్లో మంచి ప్రదర్శన కనబర్చి.. టీమిండియా విశ్వవిజేతగా నిలవడంలో తన వంత పాత్ర పోషించింది. దీంతో.. అర్చనా దేవి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది.
అప్పటి వరకు మంత్రగత్తె అంటూ సావిత్రి ఇంట్లో పచ్చిమంచి నీళ్లు కూడా ముట్టుకోని ఆ ఊరి జనం.. ఇప్పుడు సావిత్రి ఇంట్లో చేరిపోయి మన ఊరికి ఈ కూతురు పేరు తీసుకొచ్చిందంటూ.. అప్పటి వరకు మర్చిపోయిన వరుసలను మళీ కలుపుకున్నారు. 16 ఏళ్లుగా తనకెదురైన నిందలు, అవమానాలు మర్చిపోయి.. అర్చనా దేవిని అభినందించేందుకు వస్తున్న చుట్టాలకు ఎంతో ప్రేమగా భోజనాలు వడ్డిస్తోంది సావిత్రి దేవి. ఒక తల్లిగా తన పిల్లల కోసం సమాజంతో పోరాటం చేసి, వారి నిందలను భరించి.. తన కూతుర్ని భారతదేశం గర్వపడే క్రికెటర్‌ని చేసింది. అందుకే అంటారు.. ‘ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు ఎవ్వరూ లేరని.
A one-handed blinder with a full-length dive by Archana Devi 🤩#CricketTwitter #U19T20WorldCup pic.twitter.com/MncIuZlDhJ
— Female Cricket (@imfemalecricket) January 29, 2023