ప్రస్తుత వైట్‌బాల్ క్రికెట్లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌లు ఎంత అద్భుతంగా ఆడుతున్నారో తెలిసిందే. అయితే వీరిద్దరిని కాదని ఒక విదేశీ బ్యాటర్‌ను వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ అంటున్నాడు హర్భజన్. అతడి కామెంట్స్‌పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఐపీఎల్ 2023లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ హిట్టర్ జాస్ బట్లర్ చెలరేగుతున్నాడు. వరుసగా రెండు హాఫ్ సెంచరీలతో రఫ్ఫాడిస్తున్నాడు. ఇప్పటివరకు నాలుగు మ్యాచులు ఆడిన బట్లర్.. 204 రన్స్‌తో ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో పొజిషన్లో ఉన్నాడు. అలాగే బుధవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వేల పరుగుల మార్క్‌ను అతడు చేరుకున్నాడు. టోర్నమెంట్లో వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న మూడో ప్లేయర్‌గా బట్లర్ రికార్డు సృష్టించాడు. అతడి కంటే ముందు కేఎల్ రాహుల్ (80 ఇన్నింగ్స్‌లు), క్రిస్ గేల్ (75 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు. ఇదిలా ఉండగా.. బట్లర్ ఆటపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల జల్లులు కురిపించాడు. వరల్డ్ నంబర్ వన్ బ్యాట్స్‌మన్ బట్లర్ అని కితాబునిచ్చాడు.
బట్లర్‌ను ఎలా పొగడాలో కూడా అర్థం కావడం లేదన్నాడు భజ్జీ. వైట్ బాల్ క్రికెట్లో అతడు అద్భుతంగా ఆడతాడని.. క్రీజును పూర్తిగా వాడుకుంటాడని టర్బనేటర్ చెప్పుకొచ్చాడు. బట్లర్ బ్యాటింగ్ టెక్నిక్ కూడా గొప్పగా ఉంటుందని.. స్పిన్నర్లను కూడా ఎంతో అలవోకగా ఎదుర్కొంటాడని మెచ్చుకున్నాడు. కాగా, బట్లర్‌ను పొగుడుతూ హర్భజన్ చేసిన కామెంట్స్‌పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. బట్లర్‌ను మెచ్చుకోవడంలో తప్పు లేదు కానీ.. తనే ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ అని ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు. వైట్‌బాల్ క్రికెట్లో ప్రస్తుతం చెలరేగి ఆడుతున్న విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ లాంటి స్టార్ బ్యాటర్లను కాదని బట్లర్‌ను ఎలా వరల్డ్ నంబర్ వన్ అంటారని క్వశ్చన్ చేస్తున్నారు. భజ్జీ కనీసం విరాట్, సూర్య పేర్లను కూడా ప్రస్తావించకపోవడం ఏంటని సీరియస్ అవుతున్నారు.