క్రికెట్ లో బ్యాట్స్ మెన్ భారీ సిక్స్ లు కొడితే ప్రేక్షకులు గాయపడ్డం చూశాం. అదే విధంగా గ్రౌండ్ లో బాల్ తగిలి ఆటగాళ్లు గాయపడ్డం చూశాం. కానీ తాజాగా ఇంగ్లాండ్-పాక్ మధ్య జరిగిన 6వ టీ20లో ఓ సరదా సన్నివేశం టోటుచేసుకుంది. అదేంటంటే.. పాక్ బ్యాటర్ కొట్టిన బంతి నేరుగా వెళ్లి లెగ్ అంపైర్ అలీం దార్ తొడకు తగిలింది. ఈ వీడియోని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దాంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ను ఓడించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
పాక్-ఇంగ్లాండ్ మధ్య 7 టీ20 మ్యాచ్ ల సిరీస్ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా 6వ టీ20 మ్యాచ్ లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరిగింది. పాకిస్థాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ ఫన్నీ సన్నివేశం జరిగింది. క్రీజ్ లో బాబర్ అజామ్-హైదర్ అలీ ఉన్నారు. పవర్ ప్లే చివరి ఓవర్ అయిన 6వ ఓవర్ వేయడానికి ఇంగ్లాండ్ బౌలర్ గ్లీసన్ వచ్చాడు. స్ట్రైకింగ్ ఎండ్ లో హైదర్ అలీ ఉండగా.. గ్లీసన్ షార్ట్ పిచ్ బంతిని వేశాడు. ఆ బాల్ ను అలీ బలంగా లెగ్ సైడ్ బాదాడు. దాంతో ఆ బాల్ సరాసరి వెళ్లి అంపైర్ అలీం దార్ తొడకు తాకింది. బాల్ వస్తున్నా గానీ ఎటూ తప్పించుకోలేని పరిస్థితి దార్ ది. తప్పించుకుందామని ఎగిరినప్పటికీ.. తాకకుండా తప్పించుకోలేక పోయాడు. నొప్పితో తొడను బాగా రుద్దుకున్నాడు. ఇంగ్లాండ్ ఆటగాడు వచ్చి అతడిని పరామర్శించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియో గురించి సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ సరదాగా స్పందిస్తున్నారు. “అలీం దార్ జీ జర జాగ్రత్త.. ఇంకా ఎన్నో మ్యాచ్ లకు అంపైరింగ్ చేయాలి” అంటే. “చూసుకోవాలి కదా.. నిద్రపోతున్నారా ఏంటి? అని సరదాగా స్పందిస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మెుదట బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పొయి 169 పరుగులు చేసింది. పాక్ జట్టులో కెప్టెన్ బాబర్ అజామ్ ఒక్కడే 59 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్ లతో 87 పరుగులతో రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో విల్లీ, సామ్ కరన్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు కేవలం 2 వికెట్లు మాత్రమే కొల్పొయి 14.3 ఓవర్లోనే లక్ష్యాన్నిఛేదించింది. ఇంగ్లాండ్ జట్టులో ఫిలిప్ సాల్ట్ కేవలం 41 బంతుల్లోనే 13 ఫోర్లు, 3 సిక్స్ లతో 88 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. దీంతో సిరీస్ లో ఇరు జట్లు 3-3తో సమంగా నిలిచాయి. మ్యాచ్ ను ఒంటి చేత్తో గెలిపించిన సాల్ట్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
Ouch! 😬#PAKvENG | #UKSePK pic.twitter.com/DaD6EwSaVV
— Pakistan Cricket (@TheRealPCB) September 30, 2022