సచిన్ టెండూల్కర్.. ప్రపంచ క్రికెట్ చరిత్ర పుస్తకంలో స్వర్ణాక్షరాలతో లిఖించబడ్డ పేరు. ఇండియన్ క్రికెట్‌కు అతనే దేవుడు. దాదాపు 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో తన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన మాస్టర్ బ్లాస్టర్. ఈ భూమ్మిద ఉన్న అన్ని ప్రముఖ మైదానాల్లో పరుగుల వరద పారించి, రికార్డుల కోట కట్టిన దిగ్గజం. క్రికెట్ పుట్టినప్పటి నుంచి ఏ క్రికెటర్ కూడా కలలోనైనా ఊహించని వంద సెంచరీల రికార్డును నెలకొల్పిన ఘనుడు. క్రికెటే శ్వాసగా.. బ్యాటింగే ధ్యాసగా బతికిన లివింగ్ లెజెండ్. మరో వందేళ్లకైనా.. క్రికెట్ అంటే గుర్తుకువచ్చే పేరు సచిన్ టెండూల్కర్. ఇంతటి ఘన చరిత్రను సృష్టించి.. ప్రపంచంలోనే గొప్ప క్రికెటర్‌గా ఎదిగేందుకు.. సచిన్ ఆటను ఎంతగా ప్రేమించాడో, ఎంతలా ఆరాధించాడో మాటల్లో చెప్పలేం. అది కొన్ని దశాబ్దాల పాటు సాగిన మహా యాగం. క్రికెట్ చరిత్రలో భారత జెండాను రెపరెపలాడించేందుకు సచిన్ చేసిన శ్రమ, పడిన కష్టమంతా ఒకెతైయితే.. ఆట కోసం, దేశం కోసం.. సచిన్ చేసిన త్యాగం, చూపిన తెగువ మరో ఎత్తు.
క్రికెట్ కోసం కుటుంబంతో గడపాల్సిన ఎన్నో మధుర క్షణాలను సైతం త్యాగం చేసిన సచిన్.. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, దుఃఖాన్ని కూడా లెక్కచేయకుండా.. గుండెల్లో పొంగుతున్న బాధను కన్నీళ్ల రూపంలో బయటికి రాకుండా.. గుండె రాయి చేసుకుని మరీ దేశం కోసం ఆడాడు. వరల్డ్ కప్ లాంటి వేదికపై దేశపు పరువుపోకుండా నిలిపేందుకు, తండ్రి చనిపోయిన బాధను సైతం పంటిబిగువన అదిమిపట్టి.. మైదానంలోకి దిగాడు సచిన్. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ.. సెంచరీతో చెలరేగి.. 1999 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియాకు తొలి విజయాన్ని అందించాడు. అంతముందు సచిన్ ఎన్నో భారీ ఇన్నింగ్స్‌లు ఆడినా.. కెన్యాపై చేసిన ఆ సెంచరీ, సెంచరీ తర్వాత ఆకాశం వైపు తలెత్తి చూస్తూ.. సచిన్ చేసిన అభివాదం. భారతీయ క్రికెట్ అభిమానుల హృదాయాలను కలిచివేసింది. తండ్రి మరణంతో మనిషిగా కుంగిపోయిన సచిన్.. ఆటగాడిగా మాత్రం దేశం కోసం నిలబడ్డాడు. అందుకే ఆ ఇన్నింగ్స్ సచిన్ కెరీర్‌లోనే అతి గొప్ప ఎమోషనల్ ఇన్నింగ్స్.
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 1999 కోసం టీమిండియా బ్రిటన్ గడ్డపై అడుగుపెట్టింది. జట్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నాడు. ఆ టైమ్‌లో టీమిండియా అంటే సచిన్.. సచిన్ అంటే టీమిండియా అనేలా ఉంది పరిస్థితి. సచిన్ ఆడితేనే విజయం దక్కేది. సచిన్ ఒక్కడిని అవుట్ చేస్తే చాలు.. ఇండియాను ఓడించినట్లే అని అన్ని జట్లు భావించేవి. ఇండియాతో మ్యాచ్ అంటే సచిన్‌ను అవుట్ చేసేందుకు ప్రత్యర్థి జట్టు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగేది. అలానే.. 1999 వరల్డ్ కప్‌లో టీమిండియాతో తొలి మ్యాచ్‌లో తలపడిన సౌతాఫ్రికా జట్టు కూడా.. సచిన్ కోసం పక్కా ప్లాన్‌తో ఆడి.. 28 పరుగులకే సచిన్‌ను అవుట్ చేసి సక్సెస్ అయింది. అలాగే మ్యాచ్‌లో కూడా గెలిచింది.
ఇక రెండో మ్యాచ్ జింబాబ్వేతో.. పసికూన పైన టీమిండియా ఈజీగా గెలుస్తుందని అంతా భావిస్తున్న తరుణంలో టీమిండియాపై పిడుగులాంటి వార్త పడింది. జింబాబ్వేతో మ్యాచ్ ఆరంభానికి ముందు సచిన్ టెండూల్కర్ తండ్రి రమేష్ టెండూల్కర్ కన్నుమూశారనే వర్తనం అందించింది. తండ్రి మరణవార్తతో వెంటనే ఇంగ్లండ్ నుంచి స్వదేశానికి పయనమయ్యాడు సచిన్. కొండంత అండ కన్నుమూయడంతో సచిన్ శోకసంద్రంలో మునిగిపోయాడు. క్రికెటర్ అవ్వాలన్న తన కలలను నిజం చేసేందుకు అహర్నిశలు శ్రమించిన వ్యక్తి.. ఇకపై తనతో ఉండరనే విషయం తెలిసి.. సచిన్ కన్నీటి పర్యంతమయ్యాడు. చిన్నకొడుకు కావడంతో తానే తండ్రి చితికి నిప్పు పెట్టాడు.
ఈ లోపు జింబాబ్వేతో జరిగిన రెండో మ్యాచ్‌లో సచిన్ లేకుండా ఆడిన టీమిండియా దారుణ ఓటమిని మూటగట్టుకుంది. వరల్డ్ కప్‌లో పసికూన జింబాబ్వే చేతిలో ఓటమితో టీమిండియా పరువుపోయింది. వరల్డ్ కప్‌లో నిలవాలంటే.. తర్వాతి మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలి. కెన్యాతో మ్యాచ్ అయినా.. జింబాబ్వేతోనే ఓడిన జట్టుకు కెన్యా కూడా ఆస్ట్రేలియాలా కనిపిస్తోన్న సమయం అది. ఇలాంటి పరిస్థితిల్లో తండ్రి చితికి నిప్పు పెట్టిన మరుక్షణమే తిరిగి ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కాడు సచిన్. తండ్రి చనిపోయిన బాధను కంటి చివర్లలోనే ఆపుకుంటూ.. బరువెక్కిన హృదయంతో ఇంగ్లండ్‌లో అడుగుపెట్టాడు. మరుసటి రోజు కెన్యాతో మ్యాచ్. తండ్రి మరణించిన మరసటి రోజే మ్యాచ్ ఆడేందుకు వచ్చిన సచిన్‌కు క్రికెట్ అభిమానులు మద్దతుగా నిలిచారు. తండ్రి లేని లోటు తీర్చలేనిదే అయినా.. భారత దేశం మొత్తం నీ వెంట ఉంది అంటూ ప్లకార్డులు ప్రదర్శించి మద్దతు తెలిపారు.
మ్యాచ్ మొదలైన కొద్ది సేపటికే ఓపెనర్లు గంగూలీ, సదగొప్పన్ రమేష్ అవుట్ అయ్యారు. దీంతో నాలుగో స్థానంలో సచిన్ బ్యాటింగ్‌కు వచ్చాడు. తండ్రి మరణంతో గుండెల్లో ఉప్పొంగుతున్న బాధతో నేలను మాత్రమే చూస్తూ.. సచిన్ మైదానంలోకి నడిచాడు. తనలోని బాధను దేశం కోసం పరుగుల రూపంలో మారుస్తూ.. కెన్యాపై చెలరేగిపోయాడు. వరల్డ్‌కప్‌లో ఉండాలంటే కచ్చితంగా గెలిచితీరాల్సిన మ్యాచ్‌లో సచిన్ విశ్వరూపం చూపించాడు. ఫోర్లు, సిక్సులు బాదుతూ.. సెంచరీ పూర్తి చేశాడు. అంతకుముందే వన్డేల్లో 21 సెంచరీలు బాదిన సచిన్ గతంలో ఎప్పుడూ అంత ఎమోషనల్ కాలేదు. తొలి సారి ఈ మ్యాచ్‌లోనే.. సెంచరీ చేసి, హెల్మెట్ తీసి, బరువెక్కిన హృదయంతో ఆకాశానికేసి చూస్తూ.. తన సెంచరీని తండ్రికి అంకింతమిచ్చాడు. ఆ క్షణం భారతీయుల హృదాయాల్లో అలా నిలిచిపోయింది. అప్పటి నుంచి సచిన్ సెంచరీ చేసిన ప్రతిసారీ అదే అభివాదం చేశాడు.
ఆ మ్యాచ్‌లో 101 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్సులతో 140 పరుగులు బాదాడు సచిన్. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 329 పరుగుల భారీ స్కోర్ చేసి.. మ్యాచ్‌ను కూడా 94 పరుగుల తేడాతో గెలిచి.. వరల్డ్ కప్‌లో నిలిచింది. తండ్రి మరణాన్ని తట్టుకుని.. సంచరీతో కదంతొక్కి.. టీమిండియాను వరల్డ్‌కప్‌లో నిలిపిన వీరుడిగా మారాడు సచిన్ టెండూల్కర్. ఆ రోజు సచిన్ ఆడిన తీరు, చేసిన త్యాగం.. క్రికెట్‌పై, దేశంపై సచిన్‌కు ఉన్న ప్రేమను తెలియజేస్తున్నాయి. సచిన్ ఆడిన ఆ ఇన్నింగ్స్ ఎందరో క్రికెటర్లకు స్ఫూర్తి దాయకం. ప్రపంచం కీర్తించే గొప్ప క్రికెటర్‌గా సచిన్ ఎదిగాడంటే అందుకు కారణం కేవలం సచిన్ ఆట మాత్రమే.. ఆటపట్ల అతనికున్న అంకితభావం. ఇలాంటి క్రికెటర్ తరానికి ఒక్కడు కాదు.. యుగానికి ఒక్కడు మాత్రమే పుడతాడు. మన అదృష్టం ఆ క్రికెట్ గాడ్ మన దేశంలో, మన కాలంలో పుట్టి.. తన ఆటను భాగ్యం మనకు ప్రసాదించాడు. సచిన్ అంటే పేరు కాదు.. 140 కోట్ల మందిలో ఉండే ఎమోషన్.