ఆటతోనే కాదు తన ఆహార్యం, నడవడిక, స్టైల్ సెన్స్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విరాట్ కోహ్లీ.. తాజాగా చేతికి ధరించిన వాచ్ తో వార్తల్లోకెక్కాడు.
స్టేడియంలో తన ఆటతీరుతో ప్రేక్షకులను కట్టిపడేసే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. మైదానం బయట తన ఫ్యాషన్ తో అభిమానుల మది దోచేస్తుంటాడు. మెరుగైన ప్రదర్శన కనబర్చేందుకు గంటల తరబడి శ్రమించే విరాట్ బయటకు వస్తే.. తన స్టైల్ తో ఆశ్చర్యానికి గురిచేస్తుంటాడు. తాజాగా వెస్టిండీస్ పర్యటన సందర్భంగా విరాట్ ధరించిన గడియారం అభిమానులను అమితం గా ఆకర్శించింది. ఈ పర్యటనలో భాగంగా విండీస్ తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో కోహ్లీ దుమ్మురేపిన విషయం తెలిసిందే. రెండో టెస్టులో చక్కటి సెంచరీ బాదిన కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్ లో 76 వ శతకాన్ని తన పేరిట లిఖించుకున్నాడు. ఆ తర్వాత మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో కోహ్లీకి రెస్ట్ దక్కింది. తొలి మ్యాచ్ లో విరాట్ ఆడినా.. ప్రత్యర్థి జట్టు తక్కువ స్కోరు చేయడంతో కోహ్లీ బ్యాటింగ్ కు రాలేదు. మిగిలిన రెండు మ్యాచ్ ల్లోనూ రోహిత్, కోహ్లీకి విశ్రాంతినిచ్చి మేనేజ్ మెంట్ యువ ఆటగాళ్లను పరీక్షించింది.
రెండో వన్డే తుది జట్టులో లేకపోవడంతో డ్రింక్స్ బాయ్ అవతారమెత్తిన కోహ్లీ.. మూడో మ్యాచ్ లో సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ గా కనిపించాడు. అయితే ఈ క్రమంలో విరాట్ చేతికి వాచ్ తో కనిపించాడు. సాధారణంగా క్రికెట్ తో బిజీగా ఉండే విరాట్ బయట కార్యక్రమాల్లో తప్ప స్టేడియంలో ఇలాంటి ఉపకరణాలతో దర్శనమివ్వడం చాలా అరుదు. అలాంటిది విండీస్ తో సిరీస్ లో విరాట్ కు విశ్రాంతి దక్కడంతో ఇలా తన వాచ్ తో ఆకట్టుకున్నాడు.
అయితే విరాట్ ధరించిన వాచ్ విలువ 88 లక్షల రూపాయలు అని తేలియడంతో సోషల్ మీడియాలో కామెంట్ల వెల్లువ కొనసాగుతోంది. ‘అందుకేనా కోహ్లీ టైమ్ అంత బాగా నడుస్తోంది’అని ఒక నెటిజన్ కామెంట్ చేస్తే.. ‘మరొకరు ఎంత ఖరీదైన గడియారమైనా.. అదే టైం చూపిస్తుంది’ అని అభిప్రాయపడ్డారు. స్టైల్ కు మారుపేరుగా నిలిచే కోహ్లీ ఏం చేసినా.. అది అదిరిపోద్ది అని అతడి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.