ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా సెమీస్ వరకు వెళ్లిన విషయం తెలిసిందే. సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసి.. వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో టీమిండియాపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇంగ్లండ్‌కు కనీసం పోటీ ఇవ్వలేకపోయారని, ఐపీఎల్‌లో బాగానే ఆడే వాళ్లు వరల్డ్ కప్‌లో మాత్రం చేతులెత్తేస్తున్నారని క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. దీంతో బీసీసీఐ ప్రక్షాళణకు సిద్ధమైంది. తొలుత చేతన్ శర్మ నేతృత్వంలోని నేషనల్ సెలెక‌్షన్ కమిటీని తొలగించింది. ఇక బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే ముందు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కీలక సమావేశానికి పిలిచింది.
ద్రవిడ్‌ను బయటికి పంపే కుట్ర..?
టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా వైఫల్యంతో పాటు మరికొన్ని కీలక విషయాలపై రోహిత్, ద్రవిడ్‌తో చర్చించనున్నారు బోర్డు పెద్దలు. అయితే.. దీనికి వెనుక రహస్య అజెండా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సౌరవ్ గంగూలీని బలవంతంగా బోర్డు నుంచి బయటికి పంపేసిన బీసీసీఐ.. ఇప్పుడు ద్రవిడ్‌ను సాగనంపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే బంగ్లా టూర్‌కు ముందే మూహూర్తం ఫిక్స్ చేశారని చెప్పొచ్చు. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీస్ వరకు వెళ్లింది. అది మరీ దారుణమైన వైఫల్యం కాదు. గ్రూప్ స్టేజ్‌లో ఇంటిబాట పట్టిన జట్ల కంటే కూడా టీమిండియా చాలా బెటర్. కానీ.. భారత జట్టుపై ఉండే భారీ అంచనాలే.. సెమీస్ ఓటమిని మరీ ఎక్కువగా ప్రొజెక్ట్ చేసి చూపించాయి. ఈ విషయాన్ని పక్కన పెడితే..
భారత క్రికెట్‌లో క్రికెట్‌తో సంబంధంలేని వ్యక్తుల ప్రమేయాన్ని పెంచాడానికే.. మాజీలను బోర్డు నుంచి టీమిండియా నుంచి దూరం చేస్తున్నట్లు సమాచారం. ఆ ప్లాన్‌లో భాగంగానే దాదాను ఇంటికి పంపిన బోర్డు పెద్దలు.. వారి మాట వినే రోజర్ బిన్నీ లాంటి వ్యక్తిని నియమించుకున్నారు. ఇప్పుడు వారికి అడ్డుగా ద్రవిడ్ కనిపిస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే.. బంగ్లాదేశ్ పర్యటనకు ముందు కెప్టెన్‌తో పాటు కోచ్‌ను సమావేశానికి పిలిచి.. మంటపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు, వేర్వేరు కోచ్‌లు ఉండాలనే ప్రణాళికను రోహిత్, ద్రవిడ్ ముందు ఉంచనున్నారు బోర్డు పెద్దలు. కాగా.. కేవలం సౌరవ్ గంగూలీ బలవంతంతో టీమిండియా కోచింగ్ బాధ్యతలను ద్రవిడ్ స్వీకరించాడనే విషయం అందరికి తెలిసిందే.
టీమిండియాను ప్రపంచ క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా మార్చే ప్రణాళికలో భాగంగా రాహుల్ ద్రవిడ్‌ను టీమిండియా కోచ్‌గా నియమించేందుకు గంగూలీ విశ్వప్రయత్నాలు చేశాడు. ద్రవిడ్ ఎంతకీ ఒప్పుకోకపోయినా.. పోరాడి, బ్రతిమిలాడి.. ఎట్టకేలకు ద్రవిడ్ భారత కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఏ పని చేపట్టిన వందశాతం కమిట్‌మెంట్‌తో పనిచేసే ద్రవిడ్.. అదే స్థాయిలో టీమిండియాను ఒక ప్లాన్ ప్రకారం ముందుకు నడిపించాడు. కానీ.. బుమ్రా, జడేజా లాంటి ఆటగాళ్ల గాయాలు, కేఎల్ రాహుల్, రోహిత్ ఇతర ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోవడంతో.. వరల్డ్ కప్‌లో ద్రవిడ్ ప్లాన్లు వర్క్‌అవుట్ కాలేదు. అంతమాత్రానా ద్రవిడ్‌ను తక్కువగా అంచనా వేయలేం.
అలాంటి వ్యక్తిని సమావేశానికి పిలిచి.. మీ వల్లే జట్టు విఫలమైందని నిందవేసి, ఏదో ఒక ఫార్మాట్‌కు పరిమితం చేస్తే.. ద్రవిడ్ కచ్చితంగా అంగీకరించడు. కచ్చితంగా పూర్తి స్థాయిలో కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకుంటాడు. బీసీసీఐ పెద్దలకు కూడా ఇదే కావాలి. వన్డే, టెస్టులకు ద్రవిడ్‌ను పరిమితం చేసి.. టీ20 ఫార్మాట్‌లో ధోనిని కోచ్‌గా నియమించాలనే నిర్ణయాన్ని ద్రవిడ్ ముందు బోర్డు ఉంచనున్నట్లు సమాచారం. అలాగే కెప్టెన్‌గా కూడా రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాను నియమించాలని బోర్డు పెద్దలు భావిస్తున్నారు. ఆటగాడిగా రోహిత్ బోర్డు మాట వినితీరాల్సిందే. లేదా ఆట నుంచి తప్పుకోవాలి. రోహిత్ అంత పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. కానీ.. ద్రవిడ్ మాత్రం కచ్చితంగా లొంగి ఉండే వ్యక్తి కాదు. అతని వ్యక్తిత్వం అలా ఉండనివ్వదు. ద్రవిడ్‌లోని ఈ ఆత్మగౌరవాన్ని అడ్డుపెట్టుకునే.. బోర్డు పెద్దలు ద్రవిడ్‌ను ఇంటికి సాగనంపాలని భావిస్తున్నారు. గంగూలీ తర్వాత ద్రవిడ్ కూడా టీమిండియాను వదిలేస్తే.. తర్వాత క్రికెట్ పరిస్థితిపై క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
The BCCI will hold a meeting with Virat Kohli, Rohit Sharma and Rahul Dravid to discuss the roadmap of T20is. (Reported by Indian Express).
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 11, 2022