దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య రాజకీయంగా సంచలనం సృష్టించింది. తొలుత ఆయనది సహజ మరణం అని వార్తలు వచ్చినా.. తర్వాత ఆయనను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు తెలిసింది. వివేకా హత్య కేసులో నలుగురి అరెస్ట్ చేసినా కూడా.. ఇంకా ఆరోపణలు ఆగడంలేదు. వివేకా హత్య వెనుక ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఉన్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలను ఏకంగా వివేకా కూతురు వైఎస్ సునీత చేయడంతో పెనుదుమారం రేగింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ చెల్లెలు వైఎస్ విమలరెడ్డి సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చి.. సంచలన విషయాలు వెల్లడించారు.
తన అన్న వైఎస్ వివేకానందరెడ్డిని హత్య వెనుక తమ కుటుంబసభ్యుడు వైఎస్ అవినాశ్ రెడ్డి పాత్ర లేదని ఆమె అన్నారు. అనవసరంగా అతనిపై అభాండాలు వేస్తున్నట్లు పేర్కొన్నారు. అతను సొంత పెద్దనాన్నను హత్య చేసేంత చెడ్డ వ్యక్తి కాదని అన్నారు. రాజకీయ ప్రలోభాల వల్లే అవినాశ్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు వైఎస్ విమల వెల్లడించారు. ఈ విషయంలో వివేకా కూతురు, తన మేనకోడలు వైఎస్ సునీతతో తాను మాట్లాడినట్లు ఆమె పేర్కొన్నారు. సాక్ష్యాధారాలు ఉంటే వెల్లడించాలని, అంతే కానీ ఇలా తప్పుడు ఆరోపణలు చేయవద్దని కోరినట్లు తెలిపారు. అయినా కూడా సునీత ఒక తప్పుడు అపోహలో ఉన్నట్లు ఆమె వెల్లడించారు.
అలాగే వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు అవినాశ్ అక్కడే క్యాంపెయినింగ్‌లో ఉన్నాడని.. ప్రకాశ్‌రెడ్డి అనే వ్యక్తి ఫోన్‌లో సమాచారం ఇస్తే అవినాశ్ అక్కడికి వెళ్లి ఇతర కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడని ఆమె వెల్లడించారు. సిట్ దర్యాప్తులో ఇదే విషయం తేలినప్పటికీ.. దీనిపై అనవసరపు రాదాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అవినాశ్‌కు వివేకా సపోర్టుగా ఉన్నారని.. అలాంటి వ్యక్తిని ఆ పిల్లాడు ఎందుకు చంపుతాడని ప్రశ్నించారు. తన అన్న వైఎస్సార్ చనిపోయిన తర్వాత తాము చాలా కష్టాలు పడినట్లు తెలిపారు. మరి వివేకా హత్య విషయంలో ఎంపీ అవినాశ్ పాత్రపై వైఎస్సార్ చెల్లెలు విమల ఇచ్చిన వివరణపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: 8 కోట్లు, 9మంది..సస్పెన్స్ వీడుతున్న వైఎస్ వివేకా హత్య కేసు
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.