మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి 2019 మార్చి 15 పులివెందులలోని తన స్వ గృహంలో అనుమానాస్పద రీతిలో మరణించిన విషయం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. అప్పటి నుంచి ఈ కేసు విషయంలో ఎన్నో కీలక మలుపులు తిరుగుతూ వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రోజుకో మలుపు తిరుగుతూ వస్తుంది. తాజాగావైయస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యాలు చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆస్తుల కోసమే తన చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరగలేదని అన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి ఆస్తుల విషయంపై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైయస్ షర్మిల స్పందించారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ‘చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఆస్తుల కోసం జరిగింది కాదు.. ఎందుకంటే ఆయన ఆస్తులన్నీ ఎప్పుడో సునిత పేరు రాశారు.. అయినా సునిత పేరున ఆస్తులు ఉంటే వేరే వారికి రాస్తారని అనడంలో అసలు అర్థమే లేదు.. వైయస్ వివేకానంద రెడ్డి ప్రజల మనిషి.. పులివెందుల, కడప ప్రజలకు ఆయన ఎంటో.. ఆయన వ్యక్తిత్వం ఏంటో అంతా తెలుసు.. ఎంత ఆస్తి ఉన్నా.. రాజకీయాల్లో కీలక వ్యక్తి అయినా.. చిన్నాన్న చాలా సాధారణ జీవితం గడిపారు.
ఇటీవల మీడియాలో ఆయన వ్యక్తిగత జీవితం గురించి అర్థం పర్ధం లేకుండా మాట్లాడుతున్నారు.. చూపిస్తున్నారు. ఎంతో గొప్పగా బతికిన ఆయన గురించి తక్కువ చేసి చూపిస్తున్నారు.. మా చిన్నాన్న జీవితం గురించి మాట్లాడే హక్కు ఏ ఒక్కరికీ లేదు. ఆయనపై చేస్తున్న తప్పుడు ప్రచారాలను నేను పూర్తిగా ఖండిస్తున్నా.. ఆయన గురించి తప్పుడు ప్రచారం చేస్తూ మీడియా విలువలు కోల్పోయేలా చేయొద్దు.. మరోసారి చెబుతున్నా.. చిన్నాన్న హత్య ఆస్తుల కోసం జరిగింది కానేకాదు..’ అని అన్నారు షర్మిల. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.