గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించిన అంశం హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎన్నో కీలక అంశాలు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం కొన్నిరోజులుగా విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వివరాల్లోకి వెళితే..
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట లభించింది. వివేకా హత్య కేసుల అవినాష్ రెడ్డి తెలంగాణ హై కోర్టులో దాఖలు చేసిన ముందు బెయిల్ పై శనివారం వాదనలు జరిగాయి. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు.. బుధవారం వరకు అరెస్ట్ చేయొద్దని సిబిఐ కి ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితి బాగాలేనందున అదుపులోకి తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఈ నెల 31న తుది ఉత్తర్వులు ఇస్తామని.. అప్పటి వరకు అవినాష్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలిపింది.
నిన్న అవినాష్, సునీత తరపు లాయర్ల వాదనలు విన్న కోర్టు.. నేడు సీబీఐ తరఫు లాయర్ వాదనలు ఆలకించింది. విచారణకు అవినాష్ రెడ్డి సరిగా సహకరించడం లేదని.. ఎప్పుడు నోటీసులు ఇచ్చిన ఏదో ఒక కారణం చెప్పి సమయం అడుగుతూ వస్తున్నారని తెలిపింది. అంతేకాదు ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ పలుమార్లు పిటీషన్లు వేస్తున్నారంటూ సిబిఐ తరుపు లాయర్ కోర్టుకు విన్నవించారు. అయితే ఏ ఆధారల ప్రకారం అవినాష్ పై అభియోగం మోపుతున్నారని హైకోర్టు ప్రశ్నకు.. సిబిఐ తరుపు లాయర్ సమాధానం ఇస్తూ.. సీల్డ్ కవర్ లో సాక్షుల వాంగ్మూలాలు సమర్పిస్తామని కోర్టుకు తెలిపింది.. దీనికి హై కోర్టు అంగీకరించడం జరిగింది. మరి బుధవారం అవినాష్ రెడ్డికి తీర్పు అనుకూలంగా వస్తుందా.. వ్యతిరేకంగా వస్తుందా ఆరోజు తేలిపోతుంది.