ఏపీ రాజకీయాలు ఈ మధ్య కాలంలో చాలా ప్రత్యేకం అయిపోయాయి. ఇక్కడ ఉండే సవాళ్లు, ఆరోపణలు, ట్విస్ట్ లు, త్యాగాలు, కవ్వింపులు మిగతా రాష్ట్రాలలో కచ్చితంగా ఉండవు. ఇంతేనా? ఏపీలో నాయకుల పని తీరుకి ర్యాంకింగ్స్ కూడా ఉంటాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి అప్పుడప్పుడు ఈ ర్యాంక్ లు బయటకి చెప్తూ ఉంటారు. గతంలో గడపగడపకి కార్యక్రమంలో ఏయే నేతలు ముందున్నారో సీఎం సారే స్వయంగా ప్రకటించారు. అయితే.. ఇప్పుడు పరిపాలన విషయంలో ఏ మంత్రులు బాగా పని చేస్తున్నారో సీఎం జగన్ మోహన్ ఓపెన్ గా చెప్పేశారు.
బుధవారం ఏపీ కేబినెట్ భేటీ జరిగిన విషయం తెలిసిందే. జిల్లాల వారీగా పెండింగ్ ఉన్న పనులతో పాటు, జిల్లాలలో ఏయే నాయకులు అసంతృప్తిగా ఉన్నారు అని తెలుసుకోవడం ఈ భేటీ ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. అయితే.. ఈ మీటింగ్ లో సీఎం జగన్ ఇద్దరు మంత్రులపై పూర్తి స్థాయిలో ప్రశంసలు కురిపించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యా శాఖ మంత్రి విడదల రజనీ పనితీరు పట్ల సీఎం జగన్.. సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రెండు శాఖల పని తీరు బాగుందని సీఎం కితాబు ఇచ్చారు. ఇక ఇదే సమయంలో.. తన శాఖ కూడా బాగుందని మంత్రి కారుమూరి నాగేశ్వర రావు ప్రస్తావించగా.. అయితే మీకు కూడా అభినందనలు అంటూ సీఎం జగన్ చమత్కరించారు. దీంతో.. మీటింగ్ లో నవ్వులు విరిశాయి.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుండి విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే తన లక్ష్యం అంటూ.. జగన్ చాలాసార్లు చెప్పారు. ఇందుకోసం “నాడు-నేడు”, విద్యా దీవెన, గోరుముద్ద, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, ఫీజు రీయంబర్స్ మెంట్ వంటి ఎన్నో పథకాలను తీసుకొచ్చారు. ఇక వైద్య రంగంలోనూ జగన్ ముందు నుండి జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. కరోనా సమయంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలే ఇందుకు ఉదాహరణ. దీంతో.. రాష్ట్రంలోవిద్య, వైద్య రంగాలు బాగా హైలెట్ అయ్యాయి. ఇప్పుడు ఆ శాఖ మాత్యులనే సీఎం జగన్ అభినందించడం విశేషం. మరి.. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల పనితీరు బాగుందన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.