ఆంధ్ర, తెలంగాణ విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆంధ్రాకే పరిమితం అయ్యింది. తెలంగాణలో ఏదో నామమాత్రంగా వ్యవహరించేది. అయితే మారుతున్న రాజకీయ సమీకరణాలు కారణంగా ఇప్పుడు తెలంగాణాలో పట్టు సాధించేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో బలపడాలని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మళ్ళీ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని భావిస్తున్న టీడీపీ.. అందుకోసం సమర్థులను పార్టీలో చేర్చుకోవాలని అనుకుంటోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నరసింహులుని తప్పించి.. ఆ స్థానంలో కాసాని జ్ఞానేశ్వర్ కి బాధ్యతలు అప్పగించింది పార్టీ. పార్టీ బలోపేతం కోసం ఇటు జ్ఞానేశ్వర్ దూకుడు ప్రదర్శిస్తుండగా.. అటు చంద్రబాబు నాయుడు సైతం దూకుడు చూపిస్తున్నారు.
ఖమ్మం సభ విజయవంతమవ్వడంతో మరిన్ని జిల్లాల్లో సభలు నిర్వహించాలని భావిస్తున్నారు. గతంలో పార్టీని వీడిన వారిని తిరిగి పార్టీలోకి రావాల్సిందిగా చంద్రబాబు ఆహ్వానించినట్లు, తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపే యువనేతలు సైతం పార్టీలోకి చేర్చుకోవాలని చంద్రబాబు సూచించినట్లు ఇన్సైడ్ టాక్. ఈ నేపథ్యంలో పార్టీ వర్గాల వారు తీన్మార్ మల్లన్న ప్రస్తావన తీసుకొచ్చినట్లు చర్చ నడుస్తోంది. తీన్మార్ మల్లన్న టీడీపీతో కలిసి పని చేస్తే తెలంగాణలో పార్టీ బలోపేతమవుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కాకాని జ్ఞానేశ్వర్.. తీన్మార్ మల్లన్నను తెలంగాణలో టీడీపీకి మద్దతు ఇవ్వాలని కోరినట్లు సమాచారం.
చంద్రబాబు కూడా మల్లన్నతో ఫోన్ లో మాట్లాడి.. టీడీపీలోకి ఆహ్వానించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మల్లన్న కూడా రాజకీయాల్లో బీసీలకు సముచిత స్థానం ఇచ్చే పార్టీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీసీలకే ఎక్కువ టికెట్లు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని జ్ఞానేశ్వర్ తెలిపారు. టీడీపీ కూడా బీసీల కృషి కోసమే పని చేస్తుందని, మల్లన్న కూడా బీసీల కోసమే పని చేయాలనుకున్నప్పుడు.. కలిసి పని చేస్తే బాగుంటుందని మల్లన్నను ఒప్పించినట్లు తెలుస్తోంది.
తాజా ఇంటర్వ్యూలో కూడా మల్లన్న బీసీలకు ఎన్ని సీట్లు కేటాయిస్తారన్న విషయాన్ని కాకాని జ్ఞానేశ్వర్ ముందు ప్రస్తావించారు. మిగతా సామాజిక వర్గం వారి కంటే అత్యధిక సీట్లు బీసీలకే ఇస్తామని బల్లగుద్ది చెప్పారు. దీంతో తీన్మార్ మల్లన్న ఖచ్చితంగా టీడీపీలో చేరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి తీన్మార్ మల్లన్న టీడీపీలో చేరతారా? తీన్మార్ మల్లన్న టీడీపీలో చేరితే తెలంగాణలో బలోపేతమయ్యే అవకాశం ఉందా? తెలంగాణ రాజకీయాలను టీడీపీ పార్టీ ప్రభావం చేయగలుగుతుందా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.