ఎపిలో తీవ్ర దుమారం రేపుతున్న వాలంటీర్ వ్యవస్థ వివాదంపై టిడిపి ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు ఇటు టీడీపీ, అటు వైసీపీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి. వాలంటీర్లు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలంటూ మద్దతు తెలపడంపై పలు ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని నెలల్లో ఎన్నికలు రాబోతున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శలు ప్రతివిమర్శలతో రాష్ట్రంలో రాజకీయ వేడి పుట్టిస్తున్నారు. కాగా ఇన్ని రోజులు వ్యక్తిగతంగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్న నాయకులు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను టార్గెట్ చేశారు. రీసెంట్ గా జనసేన అధినేత వాలంటీర్లపై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై టిడిపి విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. వాలంటీర్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఎపిలో పవన్ కళ్యాణ్ త్వరలో రాబోయే ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని వారాహి యాత్ర చేపట్టారు. దీనిలో భాగంగా ఏళూరులో జరిగిన సభలో వాలంటీర్ వ్యవస్థపై మాట్లాడుతూ.. వాలంటీర్లు మహిళల అక్రమరవాణాకు పాల్పడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ తమకు క్షమాపణలు చెప్పాలంటూ రోడ్లపైకెక్కి నిరసనలు చేపట్టారు. మరోవైపు అధికార పార్టీ వైసీపీ మంత్రులు కూడా ఈ వివాదంపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కాగా ఇదే అంశంపై టిడిపి ఎంపీ కేశినేని నాని వాలంటీర్ వ్యవస్థకు మద్దతుగా మాట్లాడాడు. వాలంటీర్ వ్యవస్థపై వివాదం చెలరేగుతున్న వేళ నాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కేశినేని గుడివాడలో మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్లు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని కోరారు. వాలంటీర్లలో కొందరు చెడ్డ వాళ్లు ఉంటే వాలంటీర్ వ్యవస్థను తప్పుపట్టొద్దని వెల్లడించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచి, చెడు రెండు ఉంటాయని దీంతో వ్యవస్థలనే తప్పుపట్టడం సబబు కాదని స్పష్టం చేశారు. ప్రజల కోసం పనిచేసి, ప్రజలకు మంచి చేసే వ్యవస్థలను టిడిపి స్వాగతిస్తుందని తెలిపారు. కాగా కేశినేని నాని టిడిపిలో ఉంటూ కొంతకాలంగా అధికార పార్టీకి అనుకూలంగా కామెంట్లు చేస్తున్నాడంటూ పలువురు చర్చించుకుంటున్నారు. దీంతో నాని త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటాడనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీ కేశినేని టీడీపీలో ఉంటారా? లేక వైసీపీ గూటికి చేరుతారా? అనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.