జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. గత కొన్ని రోజులుగా.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దూకుడుగా వెళ్తొన్న సంగతి తెలిసిందే. తనపై వచ్చే విమర్శలను తిప్పికొడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉండగా.. పవన్ తన దూకుడు పెంచారు. తాజాగా వైసీపీపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదని.. ఆ పార్టీని ఓడించే బాధ్యత తనదేనన్నారు పవన్ కళ్యాణ్. అలానే అంబటి రాంబాబుపై కూడా పవన్ ఘాటు విమర్శలు చేశారు. ప్రసుత్తం ఆయన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆదివారం పల్నాడు సత్తెనపల్లిలో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో అర్హులకు పెన్షన్‌లు అందడం లేదు. కాపు నేతలతో నన్ను బూతులు తిట్టిస్తున్నారు. అంబటి కాపుల గుండెల్లో కుంపటి. పోవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియని మీరు ఇరిగేషన్ మంత్రా..? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ప్రభుత్వం మారబోతుంది. వైసీపీ అధికారంలోకి రాకుండా చూసుకునే బాధ్యత నాది. అంబటిది శవాల మీద పేలాలు ఏరుకునే మనస్తత్వం. నాకు సినిమాలే ఆధారం.. అంబటిలాగా కాదు. మీరు నోరు పారేసుకుంటే.. నేను నోటికి పని చెప్తాను. రాష్ట్రంలో రౌడీయిజం తగ్గాలి’’ అన్నారు పవన్ కళ్యాణ్.
‘‘నన్ను పీకేస్తే.. మళ్లీ మొలుస్తా.. తొక్కేస్తే.. మళ్లీ లేస్తా.. బాధ్యత లేకుండా మాట్లాడే వైసీపీ నేతలకు బలంగా సమాధానం చెబుతా. నన్ను వీకెండ్ పొలిటిషియన్ అంటున్నారు.. నేను వారానికి ఓసారి వస్తేనే.. తట్టుకోలేకపోతున్నారు. అధికారం చూడని కులాలకు అధికారం ఇచ్చి చూడాలి. కొంతమందికి పదవులిస్తే.. బీసీలను ఉద్దరించినట్లు కాదు. ఎంతమంది బీసీలకు మీరు ఉద్యోగాలు ఇచ్చారు. కొంతమంది కాపు నేతలు.. కులాన్ని అడ్డుపెట్టుకుని ఎదుగుతున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని గతంలో చెప్పా.. దానికే కట్టుబడి ఉన్నాను. ప్రజలు బలంగా కోరుకుంటే నేను సీఎం అవుతాను. అధికారం చూడని కులాలను అధికారంలోకి ఎక్కించడమే జనసేన లక్ష్యం’’ అన్నారు.
‘‘నేను ఏ పార్టీకి కొమ్ము కాయను. నేను వారాహిలో ఏపీ రోడ్ల మీద తిరుగుతాను. నా వారాహిని ఎవరు ఆపుతారో చూస్తాను. నా వారాహిని ఆపండి.. అప్పుడు నేనేంటో మీకు చూపిస్తాను’’ అని వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం జనసేనాని చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పవన్ చెప్పినట్లు.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ప్రభుత్వం మారుతుందని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
వైసీపీ అధికారంలోకి రావటం లేదు.. జనసేన గెలుపు ఎవరు ఆపలేరు – JanaSena Chief Sri @PawanKalyan #JanaSenaRythuBharosaYatra pic.twitter.com/QMtHuGlXb6
— JanaSena Party (@JanaSenaParty) December 18, 2022