అనుకున్నది అంతా అయ్యింది. గత కొంత కాలంగా అధికార పార్టీకి రెబల్ గా మారిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుని ఏపీ సిఐడి అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇప్పుడు విచారణ కొనసాగిస్తున్నారు. రానున్న కాలంలో ఈ అరెస్ట్ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయన్న విశ్లేషణలు అప్పుడే మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే నర్సాపురం పార్లమెంట్ స్థానానికి ఉపఎన్నిక అనే వాదన తెర మీదకి వస్తోంది. జగన్ సీఎం అయిన నాటి నుండి వైసీపీలో ధిక్కారణ స్వరం అంటూ వినిపించలేదు. కానీ.., ఒక్క నర్సాపురం ఎంపీ మాత్రం ఈ విషయంలో మినహాయింపు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను, అందులోని తప్పులను రఘురామ ముందు నుండి ప్రశ్నిస్తూనే వచ్చారు. సరిగ్గా ఇదే సమయంలో ఆయనకి జగన్ కి మధ్య గ్యాప్ భారీగా పెరిగిపోయింది. ఇక వైసీపీలోని మిగతా నాయకులు వ్యక్తిగత ఆరోపణలకి దిగడంతో.. రాజుగారు కూడా తన విమర్శల్లో వాడి, వేడి పెంచారు. కొన్ని సందర్భాల్లో ఆ విమర్శలు హద్దులు దాటిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రఘురామ అరెస్ట్ జరిగింది. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు, విద్వేషాలు కలిగించేలా వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణ, కులాల మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యాఖ్యలు, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు.. ఇవన్నీ ఎంపీపై మోపిన అభియోగాలు. మరి.. కోర్టులో ఈ కేసులు, నిలుస్తాయా? వీగిపోతాయా? అనే విషయాన్ని పక్కన పెడితే నర్సాపురంలో పార్లమెంట్ స్థానంలో ఎవరి బలం ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.
నర్సాపురం పార్లమెంట్ స్థానంలో జరిగిన గత ఎన్నికలను ఒక్కసారి పరిశీలిస్తే.. ఒకప్పుడు ఇది టీడీపీకి కంచుకోట అన్న విషయం అర్ధం అవుతుంది. 1984 నుండి 2004 వరకు ఇక్కడ టీడీపీకి ఎదురు లేకుండా పోయింది. అంటే 20 ఏళ్ళ పాటు.., నర్సాపురం పార్లమెంట్ స్థానంలో పసుపు జెండా మాత్రమే రెపరెపలాడింది. 99లో బీజేపీ గెలిచినా.., అది టీడీపీతో పొత్తు భాగంగా వచ్చిన గెలుపే. 2004 నుండి ఇక్కడ టీడీపీ పట్టు కోల్పోయింది. మళ్ళీ 2014లో టీడీపీ పొత్తుతో నర్సాపురంలో బీజేపీ అధికారంలోకి రాగలిగింది. ఇక 2019లో మాత్రం వైసీపీ నుండి రఘురామ కృష్ణరాజు విజయాన్ని సాధించారు. ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే నర్సాపురంలో రాజుల సామాజిక వర్గానికి, టీడీపీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే రఘురామ రాజు కనుక టీడీపీ నుండి పోటీ చేస్తే పోరు రసవత్తరం కావడం ఖాయం. మరోవైపు రఘురామ కృష్ణరాజు కేరాఫ్ అంటే నర్సాపురం. అయన ఇక్కడ పక్కా లోకల్. రాజకీయ పార్టీల అధినేతలతో రిలేషన్స్ తో పాటు.. నర్సాపురం పార్లమెంట్ స్థానంలో గ్రౌండ్ లెవెల్లో కూడా ఆయన గొప్ప ప్రజా బలం ఉంది. ఈ కారణంగానే అప్పట్లో ప్రశాంత్ కిషోర్ టీమ్ రాజు గారిని పట్టుబట్టి వైసీపీలోకి లాక్కొచ్చాయి. కాబట్టి.., ఈ పార్లమెంట్ స్థానంలో రఘురామకి తిరుగులేదు. ఇదే సమయంలో ఇక్కడ వైసీపీ కూడా బలంగా ఉండటం విశేషం. 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాలకు గాను.., 13 స్థానాలను వైసీపీనే గెలుచుకుంది. పైగా.., జగన్ గ్రాఫ్ ఆ పార్టీకి ఇప్పుడు మరింత బలం. ఇలా ఏ లెక్కల ప్రకారం చూసుకున్నా.. నర్సాపురం పార్లమెంట్ స్థానంలో ఏ పార్టీకి గెలుపు అంత సులభం కాదు. హోరాహోరీ ఫైట్ తప్పకపోవచ్చు.