వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా బర్త్ డే విషెస్ తెలియజేశారు. అయితే ఇదే ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది.
రాజకీయంగా ఎన్ని ఉన్నా గానీ సందర్భం వచ్చినప్పుడు రాజకీయ నాయకులు కలవడం అనేది మామూలే. మాటలు కలుస్తాయి, బాటలు కలుస్తాయి. ఏదైనా విశేషం ఉంటే విష్ కూడా చేస్తారు. రాజకీయ విబేధాలను వ్యక్తిగతంగా తీసుకోనంత వరకూ బాగానే ఉంటుంది. తీసుకుంటేనే సందర్భం లేకపోయినా విమర్శలు చేసుకుంటారు. అయితే ఈ విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి భిన్నంగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా టీడీపీ శ్రేణుల్లో పండగ వాతావరణం నెలకొంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినందుకు టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తారకరత్న ఆసుపత్రిలో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి, చంద్రబాబు నాయుడు మధ్య అనుబంధం మరింత పెరిగింది.
తారకరత్న అంత్యక్రియల సమయంలో కూడా విజయసాయిరెడ్డి పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారు. అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. తారకరత్న భార్య వైపు నుంచి చంద్రబాబు, తనకు బంధుత్వం ఉందని.. చంద్రబాబు తనకు అన్న అవుతాడంటూ ఆ మధ్య విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడిందని నెటిజన్లు భావించారు. తాజాగా చేసిన ట్వీట్ తో మరోసారి వారి బంధం ఎంత బలమైందో చెప్పకనే చెప్పారు విజయసాయిరెడ్డి. మరి ఇవాళ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న చంద్రబాబుకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీరు కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి మీ అభిమానాన్ని చాటుకోండి.
టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 20, 2023