సాధారణంగా క్రికెటర్లు తమ కెరీర్ కు వీడ్కోలు పలికిన తర్వాత వివిధ రంగాల్లో స్థిర పడుతూంటారు. టీమిండియా తరపున ప్రాతినిధ్యం వహించిన ఎంతో మంది ఆటగాళ్లు ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. గౌతమ్ గంభీర్, సచిన్ టెండుల్కర్ ఎంపీలుగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఓ ప్రముఖ క్రికెటర్ భార్య త్వరలో జరగబోయే గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేస్తుందన్న వార్త అటు రాజకీయ వర్గాల్లో, ఇటు క్రికెట్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. గుజరాత్ లో రెండు విడతల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివా సోలంకి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటి చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరిన్ని వివరాల్లోకి వెళితే..
గుజరాత్ రాష్ట్రంలో డిసెంబర్ 1, 5వ తారీఖుల్లో రెండు విడతలుగా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అభ్యర్థుల వెతుకులాటలో బీజేపీ ఎన్నికల కమిటీ తలమునకలైంది. బుధవారం సమావేశమైన ఈ కమిటీ.. సిద్దం చేసిన జాబితాలో టీమిండియా క్రికెటర్ జడేజా భార్య రివా సోలంకి ఉన్నట్లు అక్కడి రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత 28 సంవత్సరాల నుంచి గుజరాత్ లో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ.. ఈ సారీ కూడా గెలిచి ఐదో సారి సీఎం పీఠాన్ని అధిరోహించాలని చూస్తోంది. అందులో భాగంగానే సీనియర్లను పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వనుంది బీజేపీ. అదీ కాక జడేజా భార్య కాంగ్రేస్ కీలక, సీనియర్ నేత అయిన హరి సోలంకికి దగ్గరి బంధువు. దాంతో రివా సోలంకికి టికెట్ ఇస్తే ఓట్లు చీల్చొచ్చు అన్నది బీజేపీ ప్లాన్.
ఈ నేపథ్యంలోనే జడేజా భార్య రివా సోలంకిను తెరపైకి తెచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదీ కాక ఈ సారి గుజరాత్ ఎన్నికల్లో సంచలన పార్టీ ఆమ్ ఆద్మీ సైతం పోటీ చేస్తోంది. ఢిల్లీలోని జేపీ నడ్డా నివాసంలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికలో నిర్ణయాలపై సుదీర్ఘంగా చర్చించారు. అమిత్ షా, గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తో పాటు మరికొంత మంది కేంద్ర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే క్రికెటర్లు ఎన్నికల్లో పాల్గొన్న సందర్బాలు చరిత్రలో చూశాం గానీ.. క్రికెటర్ల భార్యలు ఎన్నికల్లో పోటీ చేయడం చరిత్రలో అరుదనే చెప్పాలి. గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేసి సోలంకి విజయం సాధిస్తుందో? లేదో? ఏం జరగబోతుందో వేచి చూడాలి.