బట్టర్ ఫ్లై ఎఫెక్ట్.. ఎక్కడో ఓ చోట జరిగిన ఓ సంఘటన.. ఇంకెక్కడో ఓ పెద్ద మార్పుకు దారి తీస్తుంది. రాజకీయాల్లో ఈ బట్టర్ ఫ్లై ఎఫెక్ట్ తరచుగా చోటు చేసుకుంటూ ఉంటుంది. ఓ రాజకీయ పార్టీ తీసుకున్న నిర్ణయాలు మరో పార్టీకి మేలు చేస్తూ ఉంటాయి. ఓ రాష్ట్రంలోని రాజకీయ విప్లవాలు, మార్పులు.. మరో రాష్ట్రంలోని రాజకీయాల్లో పెద్ద మార్పులకు దారి తీస్తూ ఉంటాయి. బీఆర్‌ఎస్ పార్టీ విస్తరణ.. రాజకీయాల్లో బట్టర్ ఫ్లై ఎఫెక్ట్‌ను తలపిస్తోంది. కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు, సక్సెస్ ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి మేలు చేసేలా కనిపిస్తున్నాయి.
బలమైన సామాజిక వర్గానికి కేసీఆర్ పెద్ద పీట!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో మార్పు కోసం అంటూ టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చారు. బీఆర్‌ఎస్ పార్టీ జాతీయ పార్టీగా మారి నెలలు గుడుస్తోంది. ఈ నేపథ్యంలోనే పక్క రాష్ట్రం అయిన ఏపీలో పాగా వేయటానికి ఆయన పావులు కదుపుతున్నారు. ఈ మేరకు కొంతమంది నేతలను తన పార్టీలోకి ఆహ్వానించారు. నిన్న ఏపీకి చెందిన నలుగురు నేతలు గులాబీ పార్టీలో చేరారు. కేసీఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. నిన్న బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన నలుగురిలో ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావటం గమనార్హం. ఈ ముగ్గురు ఏపీలో ఎక్కువ శాతం ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. వీరిలో తోట చంద్రశేఖర్ అనే మాజీ ఐఏఎస్ అధికారి ఏపీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు కూడా చేపట్టారు.
ట్రెండ్ ఫాలో అవుతున్న కేసీఆర్!
ఏపీలో కాపు సామాజిక వర్గానికి సంఖ్యా పరంగా బలం ఉందన్న సంగతి జగమెరిగిన సత్యం. ఈ సామాజిక వర్గం అండ ఉన్న పార్టీనే ఎన్నికల్లో గెలవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకే అన్ని పార్టీలు కాపు వర్గాన్ని తమవైపు తిప్పుకోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అధికార పార్టీ అయినా.. ప్రతిపక్షం అయినా ఈ సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తూ ఉంటాయి. పెద్ద ఎత్తున హామీలు గుప్పిస్తూ ఉంటాయి. ఇదే ట్రెండ్‌ను కేసీఆర్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి రాష్ట్ర పగ్గాలు అప్పగించినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు పార్టీలో ఉన్నవారికి, రేపు చేరబోయే వారికి కూడా కీలక పదవులు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చిన్న మార్పుగా మొదలైనా.. తర్వాతి కాలంలో ఇది ప్రభంజనం సృష్టించే అవకాశం కనిపిస్తోంది.
ఏపీలో కేసీఆర్ సక్సెస్‌తో సీఎం జగన్‌కు మేలు!
బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు, సాధించబోయే విజయాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మేలు చేసేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఏపీలో పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి ఎవరు అవునన్నా.. కాదన్నా కాపుల మద్దతు కచ్చితంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో బీఆర్‌ఎస్ పార్టీలోకి పెద్ద ఎత్తున కాపు నేతలు చేరితే.. ఓట్లు చీలే అవకాశం ఉంటుంది. జనసేన పార్టీకి మద్దతు తెలిపే కాపుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. ఒక వేళ టీడీపీ, జనసేన పొత్తులోకి వెళ్లినా.. బీఆర్‌ఎస్ పార్టీ కారణంగా ఓట్లు చీలి వైఎస్సార్ సీపీ నాయకులు గెలిచే అవకాశం ఉంది. కాపు నేతలు, జనం కేసీఆర్‌కు ఎంత మద్దతు నిలిస్తే.. వైఎస్సార్ సీపీకి అంతమేలు జరుగుతుంది. ఈ రకంగా చూస్తే.. ఏపీలో బీఆర్‌ఎస్ పార్టీ పుంజుకోవాలని కోరుకునే వారిలో సీఎం జగన్ ముందు వరుసలో ఉంటారు.