మీ ఖాతాలో రూ. 10 వేలు పడ్డాయా? చెక్ చేసుకోండి. ఇవాళ చాలా మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 10 వేలు చొప్పున జమ అయ్యాయి.
పేద, మధ్యతరగతి ప్రజల కోసం ఏపీ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. నిరుపేద వ్యాపారులు, హస్తకళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తులు చేసుకునే వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రతి ఏటా ఒక్కొక్కరికీ రూ. 10 వేల చొప్పున వడ్డీ లేని రుణాలు అందజేస్తున్న విషయం తెలిసిందే. జగనన్న తోడు పథకం కింద మూడేళ్లు రూ. 10 వేలు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది కూడా వడ్డీ లేని రుణాన్ని అందజేశారు. తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ఈ నిధులను విడుదల చేయడం జరిగింది. సకాలంలో రుణం చెల్లించిన వారికి ఏటా రూ. 1000 చొప్పున అదనంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏడాది కూడా అదనంగా రూ. 1000 పెంచారు.
సకాలంలో రుణం చెల్లించిన వారికి రెండో ఏడాది రూ. 11 వేలు, మూడవ ఏట రూ. 12 వేలు ఇచ్చిన ప్రభుత్వం.. నాలుగో ఏడాది రూ. 13 వేలు అందజేసింది. ఇప్పటి వరకూ రూ. 2955.79 కోట్ల రుణ సాయం అందజేశారు. ఇప్పటి వరకూ 15 లక్షలకు పైగా చిరు వ్యాపారులకు రుణ సాయం అందజేశామని సీఎం జగన్ అన్నారు. 5,10,412 మంది లబ్ధిదారులకు రూ. 549.70 కోట్ల రుణాలను అందజేశారు. గతంలో ఈ పథకం కింద డబ్బులు పొంది రుణాన్ని సకాలంలో చెల్లించిన వారికి రూ. 11.03 కోట్ల వడ్డీని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది.
తోపుడు బండ్లు, రోడ్ల పక్కన ఉన్న చిన్న చిన్న దుకాణాల్లో పండ్లు, కూరగాయలు అమ్ముకునేవారు.. టీ, టిఫిన్ సహా పలు రకాల వ్యాపారాలు చేసే చిరు వ్యాపారులు ఏ వడ్డీ వ్యాపారి మీద ఆధారపడకుండా వైసీపీ ప్రభుత్వం జగనన్న తోడు పథకం కింద రూ. 10 వేలను అందజేస్తుంది. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా ఏడో విడత కింద నిధులను వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. దీంతో వ్యాపారులు సంతోషిస్తూ సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.