తెలంగాణలోని హుజూరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నిక ఫలితాలు రౌండ్లవారిగా వెలువడుతున్నాయి. బద్వేల్‌లో ఫలితం ఏకపక్షమని ఎన్నికల ముందే ఒక అంచనా ఉంది, కానీ హుజూరాబాద్‌లో మాత్రం టైఫ్ ఫైట్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్తు వస్తున్నారు. అందరి అంచనాల ప్రకారం అనుకున్నట్లుగానే బద్వేల్‌లో అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ భారీ మెజార్టీతో దూసుకెళ్తుంది. హుజూరాబాద్‌లో అధికార పార్టీ టీఆర్‌ఎస్, ఈటెల అభ్యర్థిగా ఉన్న బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తుంది. మొదటి రౌండ్ నుంచి ఈటెల ఆధిక్యంలో కొనసాగుతున్నా ఏ దశలో అయినా టీఆర్‌ఎస్ పుంజుకొవచ్చన్న భయం అయితే బీజేపీ వర్గాల్లో ఉంది.
కాగా ఈ రెండు స్థానాల్లో పోటీలో ఉన్న కాంగ్రెస్ మాత్రం తన ఉనికి కాపాడుకోలేకపోతుంది. కనీస పోటీ ఇవ్వలేక చతికిల పడుతోంది. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఊసే లేకుండా పోయింది. 7 ఏళ్ల తర్వాత కూడా అక్కడ కాంగ్రెస్ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదని బద్వేల్ ఉప ఎన్నికలు నిరూపిస్తున్నాయి. ఇక తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ అదే స్థాయిలో అధికార పార్టీకి పోటీ ఇవ్వలేక పోతుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న బల్మూరి వెంకట్ తొమ్మిది రౌండ్లు ముగిసేసరికి కేవలం 2524 ఓట్లు పొందారు. ఇది ఆధిక్యంలో ఉన్న బీజేపీ అభ్యర్థికి, రెండుస్థానంలో ఉన్న టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఉన్న తేడాలో సగం ఓట్లు.
ఇంతటి దారుణమైన స్థితికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈటెల రాజేందర్ ఆ నియోజకవర్గంలో బలమైన నాయకుడు. టీఆర్‌ఎస్ నుంచి బయటికి వచ్చి ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరారు. ఇటు టీఆర్‌ఎస్ అధికార పార్టీగా బలంగానే ఉంది. పైగా దళితబంధు లాంటి జనాకర్షక పథకం కూడా అమలు చేసింది. పైగా ఇక్కడ పోటీ పార్టీల మధ్య కంటే వ్యక్తుల మధ్య ఎక్కువగా హైలెట్ అయింది. ఈటెల గులాబీ పార్టీ నుంచి బయటికొచ్చి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను టార్గెట్ చేశారు. ఆయనపై విమర్శలు తీవ్ర స్థాయిలో చేశారు. దీంతో ఈటెలను ఎలాగైన ఓడించాలని టీఆర్‌ఎస్ భావించింది. ఇలా ఈ ఉప ఎన్నిక కేసీఆర్ వర్సెస్ ఈటెలగా నడిచింది.
ఈ ఎన్నికపై కాంగ్రెస్ మొదటి నుంచి పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌లో కొత్త ఉత్సహాం వచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దాంతో తన మార్క్ చూపిస్తూ హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభావం చూపుతుందని అంతా భావించారు. అందుకు తగ్గట్టే యువ నాయకుడిని బరిలో నిలిపి యువ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. కానీ ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు. ఇదే హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 61 వేల పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. 2014లో 38278 ఓట్లు వచ్చాయి. 2009లో 41717 ఓట్లను కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఇప్పుడు మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక్కడ టీఆర్‌ఎస్ ఓటమి కాంగ్రెస్ కోరుకున్నదే కానీ తమ స్థానాన్ని బీజేపీ తీసుకోవడం కాంగ్రెస్‌కు భవిష్యత్తులో గడ్డుపరిస్థితిని తెచ్చే ప్రమాదం ఉంది. మరి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి, సాధించిన ఓట్లు, చూపించిన ప్రభావంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.