తెలంగాణ కాంగ్రెస్ లో చల్లబడాల్సిన రాజకీయ వేడి తిరిగి రోజురోజుకి మళ్లీ రాజుకుంటోంది. ఎన్నో రాజకీయ ఒత్తిళ్ల నడుమ ఎట్టకేలకు టీపీసీసీ పగ్గాలు రేవంత్ చెంతకు చేరాయి. దీంతో రేవంత్ కి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వటం సొంత పార్టీ నేతలకే మింగుడు పడని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొంతమంది నేతలు అసమ్మతి రాగాన్ని ఎత్తుకుంటున్నారు. అప్పట్లో ప్రధానంగా కోమటిరెడ్డి రెడ్డి వెంకట్ రెడ్డి టీపీసీసీ రేసులో ఉన్నాడంటూ అయన పేరు బలంగా వినిపించింది.
ఇక ఎన్నో చర్చల మధ్య చివరికి ఆ పదవిని దూకుడు మీదున్న రేవంత్ రెడ్డి చేజిక్కించుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం సుదీర్ఘ చర్చల మధ్య కోమటి రెడ్డి ఆశలపై నీళ్లు చల్లి వెనక్కి పంపింది. ఇక నిరాశతో వెనుదిరిగిన కోమటిరెడ్డి ఏకంగా గాంధీ భవన్ మెట్లు ఎక్కనని బహిరంగంగా గొంతు విరిచారు. ఎన్నో ఏళ్లుగా మోస్తున్న కాంగ్రెస్ జెండాను దించకూడదనే ఉద్దేశంతో చల్లబడి పార్టీని వీడనంటూ స్పష్టం చేసారు. రేవంత్ కి టీపీసీసీ పదవి దక్కటంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, కేఎల్లార్ వంటి ప్రముఖ లీడర్స్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. వీళ్ళతో పాటుగా పార్టీలోని ఇంకొంతమంది నాయకులు రేవంత్ పై గుర్రుగా ఉన్నారని చెప్పకనే చెబుతున్నారు.
తాజాగా హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశాడు. ఇటీవల హుజురాబాద్ లోని స్థానిక టీఆర్ఎస్ లీడర్ తో కౌశిక్ రెడ్డి తెరాస నుంచి టికెట్ నాకే వస్తుందంటూ సాగిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీనీపై స్పందించిన రాష్ట్ర కాంగ్రెస్ పక్కలో బల్లెంలా ఉన్నాడని ఆయన కు పార్టీ షోకాజ్ నోటీసులు పంపింది. ఇక ఏం చేయలేక కౌశిక్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బరిలో ఉండి ఉన్నట్టుండి రాజీనామా చేయటం అటు పార్టీకి ఇటు కౌశిక్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ అంటూ మేధావి వర్గం చెప్పుకొస్తోంది.
ఇక తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రాకతో పార్టీకి మేలు జరుగుతుందని కొంతమంది అంటుంటే పార్టీలోని పరిస్థితులు మాత్రం దానికి భిన్నంగా దర్శనమిస్తున్నాయి. దీనికితోడు కాంగ్రెస్ పరిస్థితి ఒక్క తెలంగాణలోనే కాదు యావత్ దేశ వ్యాప్తంగా రోజు రోజుకి దిగజారుతూ వస్తోంది. ఇలాంటి తరుణంలో ఏం చేయలేని హస్తం నేతలు ఎవరిదారి వాళ్ళు చూసుకుంటున్నారు. ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యిందని చెప్పవచ్చు. రేవంత్ రాకతోనైనా పార్టీలో మార్పు కనిపిస్తుందనుకుంటే ఆరంభంలోనే సవాళ్ళను ఎదుర్కొంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇక రానున్న రోజుల్లో పార్టీకి ఎదురవుతున్న సవాళ్ళను రేవంత్ రెడ్డి ఎలా అధిగమిస్తారో చూడాలి.