కోవిడ్ ప్రభావంతో సినీ పరిశ్రమలో పెను మార్పులు సంభవించాయి. అలానే ప్రేక్షకుల మైండ్ సెట్ గా పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఓటీటీ పుణ్యమా అని.. థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గింది. ఓటీటీలో చూసేందుకే చాలా మంది ప్రేక్షకులు మొగ్గు చూపిస్తున్నారు. అందుకే గతంలో కొన్ని సినిమాలను థియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేశారు. సూర్య, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్నహీరోల సినిమాల వరకు చాలా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలై మంచి విజయం సాధించాయి. ఇప్పటికీ కొన్ని సినిమాలో డైరెక్ట్ గా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ మీదనే రిలీజ్ అవుతున్నాయి. తాజాగా మలయాళ భామ అనుమప పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ‘బటర్ ఫ్లై’ సినిమా కూడా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ‘బటర్ ఫ్లై’ మూవీ టీమ్ వెల్లడించింది.
కేరళ కుట్టి అనుప పరమేశ్వరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే అనేక సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. ఇటీవలే కార్తీకేయ-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలో ’18 పేజెస్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ అమ్మడి మరో సినిమాకు సంబంధించిన ఓ వార్త బయటకి వచ్చింది. ఆమె నటించిన బటర్ ఫ్లై మూవీని డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కానుంది. అనుపమ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను గంట సతీష్ బాబు తెరకెక్కించారు. ఇక జెన్ నెక్ట్స్ సినిమా బ్యానర్ పై రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అర్వీజ్, గిడియోన్ సంగీతం అందించారు.
సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈమేరకు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయినా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డిసెంబర్ 29 నుంచి బటర్ ఫ్లై మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఓటీటీ సంస్థ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో అనుపమ పరమేశ్వరన్ డిసెంబర్ లో రెండు సార్లు ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నెల 23వ తేదీన “18 పేజెస్” థియేటర్లలోకి రానుంది. అలానే డిసెంబర్ 29వ తేదీన తన “బటర్ ఫ్లై” సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది.