హైదరాబాద్- తెలంగాణలో వైఎస్ సంక్షేమ పాలన తేవడమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ లక్ష్యమని వైఎస్ షర్మిల చెప్పారు. హైదరాబాద్ లో వైఎస్ జయంతి సందర్బంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీని ప్రకటించి, జెండాను ఆవిష్కరించారు షర్మిల. ఈ కార్యక్రమంలో వైఎస్ సతీమణి వైఎస్ విజయమ్మ, షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్, వైఎస్ కూతురు, కొడుకు తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం సందర్బంగా టీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై షర్మిల నిప్పులు చెరిగారు. ప్రధానంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో పేదరికం పోలేదని షర్మిల వ్యాఖ్యానించారు. రూపాయి బియ్యం కోసం ఇంకా రేషన్ షాపుల ఎదుట లైన్లు ఉంటున్నామని ఆమె ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ అధికారం ఉన్నప్పుడే ఫామ్ హౌస్ చక్కబెట్టుకుంటున్నారని విమర్శించారు వైఎస్ షర్మిల.
ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం దోచుకుని దాచుకుంటోందని ఆలోపించారు. తెలంగాణలో పేదరికం నుంచి బయటపడింది కేవలం కేసీఆర్ కుటుబం మాత్రమేనని అన్నారు షర్మిల. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉంటే పేదలకు భరోసా ఉండేదని ఆమె అభిప్రాయపడాడరు. సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పుకుంటున్న కేసీఆర్, కరోనా చికిత్స కోసం ఆస్తులమ్ముకున్న కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
తప్పైందని ముక్కు నేలకు రాస్తే కేసీఆర్ పాపం పోతుందా అని ఎద్దేవా చేశారు షర్మిల. వైఎస్ సంక్షేమం అంటే భరోసా, రక్షణ, భద్రత అని చెప్పిన షర్మిల, వైఎస్ సంక్షేమం అంటే కరోనా లాంటి ఎన్ని విపత్తులు వచ్చినా అప్పులపాలు కాకుండా నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా పొందడమని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే అదే చేసేవారని షర్మిల తెలిపారు.
ఇక కేసీఆర్ సంక్షేమం అంటే పథకాలు ప్రకటించి దిక్కులు చూడాలని షర్మిల ఎద్దేవా చేశారు. ఆరోగ్య కార్డులు ఇవ్వాలి, ఆరోగ్యాన్ని మాత్రం గాలికి వదిలేయాలని వ్యాఖ్యానించారు. రైతుభరోసా ఇచ్చి ఆ డబ్బును వడ్డీ కింద జమకట్టుకోవాలా అని ఫైర్ అయ్యారు షర్మిల. కేసీఆర్ సంక్షేమం అంటే ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఏళ్లు గడిచినా వాయిదా వేసుకోవాలని, 6 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే చనిపోయినవారు రైతులు కాదని చెప్పడం సంక్షేమమా అని కేసీఆర్ ను నిలదీశారు.
కేసీఆర్ సంక్షేమం అంటే గారడీ మాటలు, చేతికి చిప్పలు అని ఎగతాళి చేశారు షర్మిల. అటు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును పలికే అర్హత లేదని అన్నారు. తెలంగాణ బీజేపీ, కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు షర్మిల.