చిత్తూరు క్రైం- ఈ రోజుల్లో సమాజం ఎటుపోతుందో ఎవ్వరికి అర్ధం కావడం లేదు. ముఖ్యంగా యువతీ, యువకుల నడవడిక అయోమయంగా ఉంటోంది. ప్రేమ పేరుతో అమ్మాయిలు, అబ్బాయిలు చేసే వ్యవహారాలు వారి వారి కుటుంబాలకు తలవంపులు తెస్తున్నాయి. వావి వరసలు మర్చిపోయి ఈ కాలం యువత ప్రవర్తిస్తున్న తీరు అందరిని విస్తుపోయేలా చేస్తోంది. తాజాగా చిత్తూరులో జరిగిన ఘటన అందరిని ఆశ్చర్యానికి లోనుచేస్తోంది.
చిత్తూరు జిల్లా కలికిరి మండలంలోని గుండ్లూరుకు చెందిన ఓ యువకుడు ప్రేమ వ్యవహారంతో ప్రాణాలు తీనుకున్నాడు. కొర్నమిట్టపల్లెకు చెందిన సుబ్బరాజ కుమారుడు అశోక్ బాబు తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈసీజీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన తన బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయం ఆనోటా, ఈ నోటా కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆ అమ్మాయితో వరుస కుదరదని కుటుంబ సభ్యులు మందలించారు.
ఈ యువకుడు ప్రేమించిన అమ్మాయి అతనికి వరసకు చెల్లెలు అవుతుందని నచ్చజెప్పారు. తన ప్రేమ దక్కలేదని మనస్తాపం చెందిన అశోక్ బాబు ఎవ్వరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సరిగ్గా మూడు రోజుల తరువాత కొర్లకుంట మాదిగపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి చనిపోయి ఉండటం చూసిన గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి చూసిన పోలీసులు మృతుడు అశోక్ బాబుగా తేల్చారు.
దీంతో కుటుంబ సభ్యులకు సమాచారమివ్వడంతో, వారు వచ్చి చనిపోయింది తమ కుమారుడు అశోక్ బాబేనని, చేతికి వచ్చిన కొడుకు ఇక లేడని కన్నీరుమున్నీరయ్యారు. యువకుడి ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.