స్పోర్ట్స్ డెస్క్- టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనివార్య కారణాల వల్ల పెద్దగా ఫామ్‌లో లేడు. విరాట్ సెంచరీ మార్కు అందుకుని దాదాపు రెండు సంవత్సరాలు అయ్యింది. క్రికెట్ లో ఏమోగాని సోషల్ మీడియాలో ఐతే విరాట్ కోహ్లీ క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే దేశంలో అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన సెలబ్రిటీగా నిలిచిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు మరో అరుదైన రికార్డు సాధించాడు.
ప్రస్తుతం ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇంగ్లండ్‌లో 1000 పరుగులు సాధించిన మూడో భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఇంగ్లండ్‌తో ది ఓవల్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి సెషన్‌లో క్రెయిగ్ ఒవెర్టన్ బౌలింగులో ఫోర్ కొట్టిన కోహ్లీ ఇంగ్లండ్‌లో 1000 పరుగులు సాధించాడు.
ఫలితంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో 1000కిపైగా పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ సరసన చేరాడు విరాట్ కోహ్లీ. గతంలో సచిన్ టెండుల్కర్ ఆస్ట్రేలియాపై 1809 పరుగులు, ఇంగ్లండ్‌పై 1575 పరుగులు చేశారు. ఆ తరువాత రాహుల్ ద్రవిడ్ వరుసగా 1143, 1376 పరుగులు చేశాడు. ఇక విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాపై ఇప్పటి వరకు 1352 పరుగులు చేయగా, ఇంగ్లండ్ పై తాజాగా 1000 పరుగుల మార్కు దాటాడు.
దీంతో సచిన్, ద్రవిడ్ తరువాత ఇంగ్లండ్ పై 1000 పరుగులు చేసిన ఘనత విరాట్ కోహ్లీకే దక్కింది. ఈ సందర్బంగా పలువురు క్రీడారంగ ప్రముఖులు విరాట్ కోహ్లీకి అభినందనలు తెలిపారు. మరి మనం కూడా విరాట్ కు శుభాకాంక్షలు చెబుదామా..