హైదరాబాద్- తెలంగాణ రాములమ్మ ఎప్పటిలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. అదేనండీ బీజేనీ నాయకురాలు, సినిమా నటి విజయశాంతి సీఎం కేసీఆర్ పై మరోసారి మండిపడ్డారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో జనానికి అరచేతిలో వైకుంఠం చూపించారని విజయశాంతి ఎద్దేవా చేశారు. బూటకపు కబుర్లతో ప్రజలను నయవంచన చేయడంలో కేసీఆర్ నెంబర్ వన్ అనిపించుకున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు విజయశాంతి.
గొల్కొండ కోటపై సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు వింటే అరచేతిలో వైకుంఠం చూపించడమంటే ఏమిటో బాగా అర్థమవుతుందని విజయశాంతి అన్నారు. అందులోలనూ దళిత బంధు పథకం గురించి మాట్లాడుతూ రకరకాల గణాంకాలు, బడ్జెట్ కేటాయింపులంటూ కేసీఆర్ జనాన్ని బాగా మభ్య పెట్టారని విమర్శించారు. తెలంగాణలోని దళితుల సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం ఈ పథకమే అన్నట్లు కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు విజయశాంతి. గతంలో దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి వంటి హామీలిచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి కబుర్లే చెప్పారని ఆమె గుర్తు చేశారు.
సీఎం కేసీఆర్ గారి నైజం అందరికీ తెలిసిందేనని చెప్పిన విజయశాంతి, తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా అవతరించిందని చెప్పారని, పరిస్థితులు ఇంత గొప్పగా ఉంటే నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో వ్యవసాయం అంద బాగా ఉంటే రైతులకు సమస్యలు ఇంకా ఎందుకు ఎదుర్కొంటున్నారని విజయశాంతి నిలదీశారు.
హరితహారంతో పచ్చదనం పెరిగిందని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్, ఈ పథకం కోసం స్వంత డబ్బులు ఖర్చు చేసి అప్పుల పాలైన సర్పంచుల గురించి తెలియదా అని ప్రశ్నించారు. తెలంగాణను ఎంతో అభివృద్ది చేశానని చెప్పుకుంటున్న కేసీఆర్, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఎందుకు నిరసన జ్వాలలు ఎదుర్కోంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈమేరకు సోషల్ మీడియాలో విజయశాంతి పోస్ట్ చేశారు.
పట్టణప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఎందుకు నిరసన జ్వాలలు ఎదుర్కోవలసి వచ్చిందో చెప్పాలి. బూటకపు కబుర్లతో నయవంచన చెయ్యడంలో కేసీఆర్ నెంబర్ 1 అనిపించుకున్నారు.
— VIJAYASHANTHI (@vijayashanthi_m) August 16, 2021