స్పెషల్ డెస్క్- పచ్చని పెళ్లి పందిరి. పెళ్లి మంటపంలో వివాహం జరుగుతూ ఉంటుంది.. బాజా భజంత్రీలు మోగుతుంటాయి. ఆహుతులంతా ఉత్సాహంగా పెళ్లి తంతు చూస్తుంటారు. పంతులు గారు పెళ్లి మంత్రాలు చదువుతుంటాడు. ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలో తాళిబొట్టు కట్టే సమయంలో ఆపండీ.. అని ఓ గట్టి ఆరుపు వినిపిస్తుంది.. అంతే పెళ్లి ఆగిపోతుంది. అసలు ఏం జరిగిందని పెళ్లికి వచ్చిన వాళ్లంతా ఆసక్తిగా చూస్తుంటారు. ఇలాంటి సీన్స్ మీరు చాలా సినిమాల్లో చూసే ఉంటారు. కానీ నిజ జీవితంలోను అక్కడక్కడ ఇలాంటివి జరుగతుంటాయి. ఐతే చాలా అరుదని చెప్పవచ్చు. బిహార్ లో ఇలాంటి ఘటనే జరిగింది.
పాట్నాలోని పాలీగంజ్ ప్రాంతంలో ఇలాగె పెళ్లి ఆగిపోయింది. అనిల్ కుమార్, పింకీ కుమారికి ఈ నెల 15న పెద్దలు వివాహం చేయడానికి నిర్ణయించారు. అంగరంగ వైభవంగా పెళ్లి జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. కళ్యాణ మండపంలో మరి కాసేపట్లో వధువు మెడలో వరుడు తాళి కడతాడనగా.. అచ్చం సినిమాల్లో లాగా ఓ యువతి వచ్చి ఆపండి అని గట్టిగా అరిచింది. దీంతో అంతా అవాక్కయ్యారు. పెళ్లి కొడుకు తప్పా అంతా కంగారు పడిపోయారు. అసలా యువతి ఎవరు, ఏం జరిగిందని అంతా ఆరా తీయడంతో అసలు విషయం తెలిసింది. ఈ పెళ్లి కొడుకుకు అప్పటికే రహస్యంగా పెళ్లైందట.
అప్పటికే వేరే యువతిని ప్రేమించి రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఇంట్లో పెద్దలను ఎదురించలేక మరో పెళ్లికి సిద్ధమయ్యాడా యువకుడు. కాసేపట్లో వధువు మెళ్లో తాళి కడతాడనగా అనిల్ భార్య పోలీసులను వెంటపెట్టుకుని కళ్యాణ మంటపానికి వచ్చింది. తనకు ఆమెతో పెళ్లైందని అందరి ముందు పెళ్లి కొడుకు నిజం ఒప్పుకున్నాడు. దీంతో ఆ వివాహాన్ని రద్దు చేసిన పెద్దలు, ఆ తర్వాతి రోజే వరుడి తమ్ముడితో పింకీ పెళ్లి జరిపించారు. దీంతో ఆ వధువు ఆ వరుడి తమ్ముడినే పెళ్లి చేసుకుని అదే ఇంట్లో కోడలిగా అడుగుపెట్టడంతో కధ సుఖాంతం అయ్యింది.