మంచిర్యాల రూరల్- సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచం చాలా చిన్నదైపోయింది. అంతే కాదు ఏ సమాచారం అయినా క్షణాల్లో అందరికి చేరిపోతోంది. ప్రపంచంలో ఎక్కడా ఏం జరిగినా సోషల్ మీడియా ద్వార వైరల్ అవుతోంది. ట్విట్టర్, వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్.. ఒక్కటేమిటి చాలా రకాల సోషల్ మీడియాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సామాన్యులే కాదు, ప్రముఖులు, ప్రభుత్వాలు సైతం అధికారికంగా సోషల్ మీడియాలను ఉపయోగించుకుంటున్నాయి. దీంతో సోషల్ మీడియా పరిధి బాగా పెరిగిపోయింది.
ఇక సోషల్ మీడియా ద్వార చాలా మంచి పనులు జరుగుతున్నాయి. కరోనా సమయంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. సోషల్ మీడియా ద్వారా చాలా మంది సాయం పొందారు. ఇదిగో ఇక్కడ సోషల్ మీడియా ద్వార ఓ యువతి ఎలా తన సమస్యను పరిష్కరించుకుందో చూడంది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లి గ్రామానికి చెందిన జంబిశెట్టి రజిత 2018 మార్చిలో ఉపాధిహామీ పథకం కింద ఆరు వారాలు పని చేసింది. ఐతే తోటి కూలీలకు వేతనం అందినప్పటికీ రజితకు మాత్రం అందలేదు. అప్పటి నుంచి చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం లేదు.
దీంతో చేసేది లేక రజిత సోదరుడు సతీష్ మంగళవారం మంత్రి కేటీఆర్, కలెక్టర్ భారతిహోళికేరిలకు ట్యాగ్ చేసి తమ సమస్యను ట్విటర్‌లో పోస్టు చేశాడు. కలెక్టర్ భారతిహోళికేరి వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డీఆర్‌డీవోను ఆదేశించారు. మంచిర్యాల డీఆర్‌డీవో అధికారులు హైదరాబాద్ కమిషనరేట్‌లో కమిషనర్ ఆఫ్ రూరల్ డెవల్‌పమెంట్ కార్యాలయానికి వివరాలు పంపించి వెంటనే రజితకు డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. అకౌంట్ స్టేటస్ చూసి రజితకు రావాల్సిన 11,750 రూపాయలను రజిత ఇంటికెళ్లి అందజేశారు. దీంతో వారు మంత్రి కేటీఆర్, కలెక్టర్ కు కృతజ్ఞతలు చెప్పారు.