ముఖ్యమంత్రి కెసిఆర్ మనవడు మంత్రి కెటిఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు గచ్చిబౌలి ప్రాంతంలోని కేశవనగర్ ప్రాథమిక పాఠశాల పున: ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మాట్లాడిన హిమాన్షు తన మొదటి పబ్లిక్ స్పీచ్ తో అబ్బురపరిచాడు.
చిన్నతనం నుంచే సేవా కార్యక్రమాలు అలవాటు చేసుకున్న కల్వకుంట్ల హిమాన్షు రావు మరో గొప్ప పని చేశాడు. పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలను తాను సేకరించిన నిధులతో ఆధునీకరించాడు. సుమారు కోటి రూపాయలతో కార్పోరేట్ స్కూల్ లెవల్ లో వసతులు ఏర్పాటు చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా ఈ రోజు తన పుట్టన రోజు సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేశవనగర్ లోని ప్రభుత్వ పాఠశాలను పున:ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీటింగ్ లో హిమాన్షు మాట్లాడాడు. ఈ కార్యక్రమానికి హిమాన్షు స్పీచ్ హైలెట్ గా నిలిచింది. తన ఫస్ట్ పబ్లిక్ స్పీచ్ తో అదరగొట్టేశాడు హిమాన్షు. దీనిపై పలువురు స్పందిస్తూ ఫ్యూచర్ లీడర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
స్కూల్ పున: ప్రారంభోత్సవ కార్యక్రమంలో హిమాన్షు మాట్లాడుతూ.. గతంలో మీడియాతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇది నా ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ అని చెప్పారు. కొంత నర్వస్ గా ఉన్నా నా కుటుంబసభ్యుల ముందు మాట్లాడుతున్నట్టుగానే ఉందని అన్నారు. కెసిఆర్ మనవడిని కదా ఏదైనా నార్మల్ గా చేసే అలవాటు లేదు. ఏం చేసినా గొప్పగా చేయాలని ఆలోచించానన్నారు. మొదటి సారి ఈ స్కూల్ ను సందర్శించినప్పుడు అక్కడి సమస్యలు చూసి కళ్లలో నీళ్లు తిరిగాయని తెలిపారు. ఆడ పిల్లలకు సరైన వాష్ రూమ్స్ లేవు, సరైన డైనింగ్ హాల్ లేదు, ఆటస్థలం లేదు, విద్యార్థులు కూర్చునేందుకు సరైన బెంచీలు లేవని చెప్పాడు. ఆ క్షణమే ఆ స్కూల్ ను దత్తత తీసుకుని డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నాము.
దీనికోసం రెండు పెద్ద ఈవెంట్స్ ద్వారా రూ. 40 లక్షలు సేకరించాము. మరికొంత మొత్తాన్ని సిఎస్ఆర్ కింద మధుసూదన్ సహాయం చేశారని తెలిపారు. ఆ నిధులతో స్కూల్ ను అభివృద్ది చేశామని తెలిపారు. ఈ మంచి పని చేయడానికి మా తాత కెసిఆరే స్ఫూర్తి అన్నాడు. ఇదే విషయం డాడీతో మాట్లాడగా.. చదువులో గ్రేడ్ తగ్గినా సరే వంద మందికి సహాయం చేసే అవకాశం ఉంటే చేయాలని చెప్పారని హిమాన్షు తెలిపారు. వారి స్ఫూర్తితోనే ఈ గొప్ప పని చేశామని తెలిపారు. కాగా తండ్రికి తగ్గ తనయుడిగా తన మొదటి స్పీచ్ తోనే అదరగొట్టాడు హిమాన్షు. ఫస్ట్ పబ్లిక్ స్పీచ్ లోనే అనర్గళంగా మాట్లాడి అక్కడున్న వారిని మంత్ర ముగ్ధుల్ని చేశాడు. ఇక హిమాన్షు ఇచ్చిన ఈ స్పీచ్ తో తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ కొడుకుగా వారసత్వాన్ని నిలబెడతాడంటూ పలువురు చర్చింకుంటున్నారు.