తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటి నుంచి ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతున్న విషయం తెలిసిందే. దీనిపై దృష్టిపెడతాం అంటూ అధికార ప్రభుత్వం అంటూ వస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగున్నారు. బడుగుబలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తీసుకొస్తున్న ఎన్నో వినూత్న పథకాలు అమల్లోకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే రైతు బంధు పథకంతో రైతులను ఆదుకుంటున్నారు. దళిత బంధు పథకం అమలు చేస్తూ రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఈ మద్యనే బీసీలకు, మైనార్టీలకు లక్ష రూపాయల పథకాన్ని తీసుకువచ్చారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త అందించింది. వివరాల్లోకి వెళితే..
గత కొన్నేళ్లుగా టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఎదురు చూస్తున్న కలనెరవేరింది. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసేలా నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నేడు జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో చర్చించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గ మండలి కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ సందర్భంగా క్యాబినెట్ మీటింగ్ లో పలు అంశాలపై చర్చలు జరిపారు. త్వరలో జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశంలో ఈ బిల్లు ప్రవేశ పెట్టేందుకు నిర్ణయించారు.
ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ పోరాటంలో ఆర్టీసీ కార్మికులు ఎంతో కృషి చేశారు. సకల జనుల సమ్మే సమయంలో ఆర్టీసీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని టీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇకపై టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు. ఇందుకోసం అధికారులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈ మేరకు సంబంధిత నేతలకు, అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. దీనికి సంబంధించిన విధి విధానాలపై సబ్ కమిటీ ఏర్పాటు చేయబోతున్నాం’ అని అన్నారు.