జమ్మూ కశ్మీర్- ఉగ్రమూకలు మరోసారి రెచ్చిపోయారు. అకస్మాత్తుగా దాడి చేసి దొంగ దెబ్బ తీశారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. శ్రీనగర్ శివార్లలో పోలీసు క్యాంపు వద్ద టెర్రరిస్టులు పోలీసుల బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందగా, మరో 11 మంది గాయపడ్డారు.
గాయపడిన సిబ్బందిని ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసుల బస్సుపై ఉగ్రవాదుల దాడి సమాచారం తెలుసుకున్న ఆర్మీ ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాల్ని మోహరించారు. ఉగ్రవాదులు దాడికి పాల్పడిన ఘటనా స్థలాన్ని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఉగ్రవాదుల కోసం సైనికులు గాలింపు చర్యలు చేపట్టారు.
సమీపంలో దాడికి పాల్పడిన టెర్రరిస్టులు దాగి ఉండవచ్చని భద్రతాదళాలు ఆనుమానిస్తున్నారు. ఉగ్రదాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనలో మృతి చెందిన సిబ్బంది కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. పోలీసుల బస్సుపై జరిగిన ఉగ్రదాడిని మోదీ సహా పలువురు ఖండించారు.