అమ్మ.. ఒక జీవితం మొత్తానికి సరిపడే అంత దైర్యం ఇచ్చే బంధం. ఇందుకే అమ్మ ఒడిని మించిన స్వర్గం ఇంకెక్కడా దొరకదు అంటారు. అలాంటిది ఓ ఎనిమిదేళ్ల పిల్లాడికి అమ్మ దూరమైతే.. తల్లిని వెతుక్కుంటూ ఆ పిల్లాడి అడుగులు పడతాయి. సరిగ్గా.. ఇలాంటి ఘటనే తమిళనాడు విల్లుపురంలోని తిండివనంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. విలేజ్ అసిస్టెంట్ రఘురామన్-రాజేశ్వరి భార్యాభర్తలు. దంపతులన్నాక చిన్న చిన్న గొడవలు సహజం కదా? రఘురామన్-రాజేశ్వరి మధ్య కూడా ఇలాగే గొడవ జరిగింది. అది.. కాస్త పెద్ద గొడవగా మారింది. దీంతో.., రాజేశ్వరి భర్త మీద అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ.., ఆమె 8 ఏళ్ళ కొడుకు శబరీనాథ్ మాత్రం తండ్రి దగ్గరే ఉండిపోయాడు.
ఇలా కొన్ని రోజులు గడిచినా అతని తల్లి ఇంటికి తిరిగిరాలేదు. శబరీనాథ్ అమ్మ ఎప్పుడు వస్తాది అని తండ్రిని అడిగినా సమాధానం లేకుండా పోయింది. దీంతో.., శబరీనాథ్ అసాధారణమైన నిర్ణయం తీసుకున్నాడు. ఎవరికీ చెప్పకుండా తన అమ్మకోసం అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం స్నేహితుడి దగ్గర సైకిల్ తీసుకున్నాడు. రాత్రివేళ తండ్రి నిద్రపోతున్న సమయంలో సైకిల్ పైనే అమ్మమ్మ ఇంటికి బయలుదేరాడు. కానీ.., ఇక్కడ షాకింగ్ మ్యాటర్ ఏమిటంటే.. శబరీనాథ్ ఉండేది తిండివనం. అమ్మమ్మ ఇల్లు ఉండేది కల్లకురిచి. రెండు ఊర్ల మధ్య మొత్తం దూరం 92 కి.మీ. అయినా.. పర్లేదు తన తల్లిని కలుసుకుంటే చాలని ఆ చిన్నారి సైకిల్ పై ప్రయాణం మొదలు పెట్టాడు.
విల్లుపురం-నాగపట్టణం జాతీయ రహదారిపై ఏకబిగిన 14 కి.మీ దూరం వెళ్ళిపోయాడు. అప్పటికే బాగా రాత్రి అయిపోయింది. చీకటి పడిపోయింది. అయినా.., శబరీనాధ్ కి తన తల్లిని చూడాలన్న పట్టుదల ముందు ఎలాంటి భయం వేయలేదు. ఆ జాతీయ రహదారిపై రివ్వున సైకిల్ పై దూసుకెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక అతన్ని డ్యూటీలో ఉన్న పోలీసులు ఆ బాలుడిని గుర్తించారు. ఇంత అర్ధరాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నావు చిన్నా అని ప్రశ్నించారు. ఆ బాలుడు పోలీసులకి జరిగింది అంతా వివరించాడు. అడ్డు తప్పుకోండి.. నేను మా అమ్మని వెంటనే చూడాలి అంటూ పోలీసులని సైతం ఎదిరించాడు.
పోలీసులకి ఆ బిడ్డ తల్లి కోసం ఎంతలా పరితపిస్తున్నాడో అర్ధం అయ్యింది. కానీ.., జాతీయ రహదారిపై ఆ సమయంలో పిల్లాడు అంత దూరం ప్రయాణించడం మంచిది కాదని.. పోలీసులు పిల్లాడిని తమతో ఉంచుకున్నారు. వెంటనే తండ్రిని పిలుపిలిచి బాబుని అతనికి అప్పచెప్పారు. మరోవైపు ఈ విషయం ఆ తల్లికి తెలిసింది. తన బిడ్డ తన కోసం ఎంతలా పరితపిస్తున్నాడో ఆమెకి అర్ధం అయ్యింది. గొడవలకి పక్కన పెట్టి.., పరుగున భర్త దగ్గర వాలిపోయింది. అమ్మ మీద ప్రాణం పెట్టుకున్న తన కొడుకుని దగ్గరికి తీసుకుని తనివితీరా ముద్దాడింది. అయితే.., 8 ఏళ్ళ వయసున్న శబరీనాధ్ చేసింది కాస్త రిస్క్ తో కూడుకున్న పని అయినా, అతని సాహసం తల్లిదండ్రులను త్రిగి కలిపింది. దీంతో.., ఇప్పుడు నెటిజన్స్ అంతా శబరీనాధ్ ని మెచ్చుకుంటూ పోస్ట్ లు పెడుతున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.