సాధారణంగా మనం గుడికి వెళితే విద్య, ఆరోగ్యం, ఉద్యోగం, ఆర్థికంగా మన పరిస్థితుల గురించి, సంతానం గురించి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని మొక్కుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు...
మార్కెట్‌కు వెళితే అన్ని కూరగాయలలో ముందుగా గుర్తుకు వచ్చే ఐటమ్ ‘టమాట’. ఎందుకంటే టమాటాలు లేకుండా ఏ కూర రుచి ఉండదు. కూరగాయల్లో ఎక్కువగా వాడేది టమాటానే. ఇదివరకు పండిన పంటకు ధరలు లేక టమాట రైతులు మార్కెట్‌లోనే పారబోసి పోయేవారు. కానీ ప్రస్తుతం టమాటాలు పండించిన రైతులు కోట్లలో సంపాదిస్తున్నారు. దేశ వ్యాప్తంగా టమాట ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.200 దాటింది. టమాట సామాన్యుడి వంటింట్లో కనుమరుగవుతోంది. దాదాపు రెండు నెలలకు పైగా టమాటా ధరలు రికార్డ్ స్థాయిలో మోతమోగుతున్నాయి. టమాటాల ధరలు పెరగడంతో విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టమాటాల కోసం దొంగతనాలు, పోలీసులు కాపలా ఉండడం వంటివి చూస్తున్నాం. అయితే తాజాగా తమిళనాడులో టమాటా ధరలు తగ్గేలా చేయమని అమ్మవారికి టమాటాల మాలవేసి
ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం..
తమిళనాడులోని నాగపట్టణం జిల్లా కురుకుడిలో ప్రముఖ మహా మరియమ్మన్, నాగమ్మన్ ఆలయం కలదు. ఈ ఆలయానికి దేశం నలుమూలల నుండి భక్తులు తరలి వస్తుంటారు. ప్రస్తుతం ఆడి మాసం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ సందర్భంగానే భక్తులు తమ టమాటాల గోడును అమ్మవారికి తెలిపి.. ధరలు తగ్గాలని కోరుకుంటున్నారు. 508 టమాటాలతో దండ తయారుచేసి అమ్మవారి మెడలో వేసి అలంకరించారు. అమ్మవారి మెడలోంచి టమాటాలు తీసి పూజారులు ప్రసాదంగా భక్తులకు పంచుతున్నారు.
సాధారణంగా మనం గుడికి వెళితే విద్య, ఆరోగ్యం, ఉద్యోగం, ఆర్థికంగా మన పరిస్థితుల గురించి, సంతానం గురించి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని మొక్కుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం వీటితోపాటుగా నిరంతరం పెరిగిపోతున్న టమాటా ధరల గురించి పూజలు చేస్తున్నారు. కొంతమంది టమాటాలు తినలేకపోతున్నామని టమాటాల ధరలు తగ్గించాలని కోరుకుంటున్నారు. అమ్మవారికి మెడలో నిమ్మకాయల దండలు, పూల మాలలు వేసి అలంకరిస్తారు. అయితే పూలమాలలు, నిమ్మకాయల దండలతోపాటుగా టమాటాలతో మాలవేసి అమ్మవారిని ధరలు తగ్గేలా చేయాలని వేడుకుంటున్నారు.
టమాటా నిత్యావసరంగా మారడం.. ప్రతికూల పరిస్థితుల్లో దానిని తప్పించడం అందరికి ఓ సవాలుగా మారిపోయింది. ఇక టమాట ధర గురించి మాట్లాడితే రానున్నరోజుల్లో టమాటా ధర కిలో రూ.300 కుపైగా చేరే అవకాశం ఉందని హోల్‌సేల్ వ్యాపారస్తులు చెబుతున్నారు. దీంతో రిటైల్ ధరలు కూడా పెరగడం సహజం. టమాటా పంట అధికంగా పండే ప్రాంతాల్లో వేసవిలో ఎండలతో, ఆ తర్వాత భారీ వానల కారణంగా సరఫరాలో అంతరాయం కలగడం వల్ల టమాటా ధరలు అధికమయ్యాయి. లేకపోతే సాధారణ పరిస్థితుల్లో సామాన్యులకు అందుబాటు ధరలో దొరికేవి టమాటా మాత్రమే.