చెన్నై- మొన్న జరిగిన ఎన్నికల్లో తమిళనాడులో పాగా వేయాలని ఎంత ప్రయత్నించినా బీజేపీ పార్టీ పాచికలు పారలేదు. అన్నా డీఎంకేతో జత కట్టి ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీకి నిరాశే ఎదురైంది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసిన డీఎంకే పార్టీ భారీ మెజార్టీ సాధించడంతో ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఇప్పుడు ప్రతి విషయంలోను తమిళనాడులో బీజేపీ, డీఎంకే మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో స్టాలిన్ సర్కార్ పై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రిగా స్టాలిన్ విఫలమయ్యారని కామెంట్స్ చేస్తున్నారు.
కరోనా రోగులను పరామర్శించేందుకు స్టాలిన్ ఎక్కడి వెళ్లినా గో బ్యాక్ స్టాలిన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. కోయంబత్తూర్, తిరుప్పూర్, ఈరోడ్ జిల్లాల్లో చేపట్టిన కరోనా నియంత్రణ చర్యలను ఆదివారం సీఎం స్టాలిన్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో గో బ్యాక్ స్టాలిన్ అనే హాష్ టాగ్ ట్రెండ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దీంతో బీజేపీ నేతలపై డీఎంకే నేతలతో పాటు, కాంగ్రెస్ నేతలు సైతం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కరూర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో.. గో బ్యాక్ స్టాలిన్.. అంటూ ట్విట్టర్ లో పోస్టు చేస్తున్న బీజేపీ నేతల్లారా.. ఇక్కడే రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నారు… మరి ప్రధాని మోదీ ఎక్కడ.. అంటూ ఆమె ప్రశ్నించారు.
తన ట్విట్టర్‌లో కరోనా బాధితులను స్వయంగా పరామర్శిం చేందుకు పీపీఈ కిట్ ధరించిన ముఖ్యమంత్రి స్టాలిన్ ఫొటోను పోస్టు చేశారు ఎంపీ జ్యోతిమణి. ఇదిగో, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇక్కడ…మరి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఎక్కడ.. అంటూ ఆమె చేసిన ట్విట్టర్ పోస్టు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన బీజేపీ నేతలు, వారిలో భయాన్ని సృష్టించేలా రాజకీయాలు చేయడం సరికాదని జ్యోతిమణి హితువు పలికారు. ఇలా బీజేపీ నేతలు వ్యవహరించడాన్ని మిగతా పక్ష పార్టీలు సైతం తప్పుబడుతున్నాయి.